షాడో డీఎంహెచ్‌ఓ
● వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ ఉద్యోగి పెత్తనం
● నిబంధనలకు పాతరేస్తూ డిప్యుటేషన్లు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆయనో సాధారణ ఉద్యోగి. ఆ శాఖలో ఏ పని కావాలన్నా చేసేస్తాడు. చేతులు తడిపితే చాలు నిబంధనలకు పాతరేస్తూ ఏదైనా చేయగల సమర్ధుడు. శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులు ఆయన్ని షాడో డీఎంహెచ్‌వో అంటారు. డబ్బులు కొట్టండి.. పనులు చేయించుకోండి అనే తరహా వ్యవహారశైలి ఉంటుందని చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల నుంచి కారుణ్య నియామకాల వరకూ.. ఆఖరికి పోలీసు అటెస్టేషన్ వరకూ సిబ్బందికి ఏ పని కావాలన్నా ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే చాలు పని పూర్తి అయినట్లే అంటున్నారు.
ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు
వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఒక వ్యక్తి చేరగా.. అతనికి ప్రొహిబిషన్ పూర్తి కాకుండానే రాజమండ్రి డిప్యుటేషన్ వేశారు. ఈ ఏడాది జూన్‌లో ఆ ఉద్యోగి నుంచి సొమ్ములు తీసుకుని సదరు షాడో డీఎంహెచ్‌వో డిప్యుటేషన్ వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉద్యోగిది రాజమండ్రి కావటంతో సొంత ఊరిలోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక సాధారణ ఉద్యోగికి ఇలా జిల్లాలు దాటి డిప్యుటేషన్ వేయడం నిబంధనలకు విరుద్ధం. మరో ఉద్యోగి పెదపాడు నుంచి ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై చాలాకాలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో ఉద్యోగి కృష్ణాజిల్లా గొల్లపూడి నుంచి ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చి మూడేళ్ళు పూర్తి కావచ్చినా.. బదిలీలు జరుగుతున్నా వీరికి మాత్రం నిబంధనలు వర్తించడం లేదు. దీని వెనుక షాడో డీఎంహెచ్‌వో పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
అర్హత లేకున్నా పెత్తనం
అర్హత లేకున్నా ఒక ఉద్యోగి క్లాస్–4 సీటులో కూర్చొని ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతని ఉద్యోగం పీవోడీటీ సీనియర్ అసిస్టెంట్ కాగా... మరో సీటులో పాగా వేసి అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో సొమ్ములు ఇస్తే ఉద్యోగాలు ఇప్పించటం నుంచి.. రెగ్యులరైజేషన్, కారుణ్య నియామకాలు ఇలా ఏదైనా ఆయన్ని కలిసి.. జేబులు నింపితే చాలు పని సులువుగా అయినట్లేనని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. చాలా కాలంగా శాఖలో పాతుకుపోయిన సదరు ఉద్యోగి జిల్లా స్థాయి అధికారులను మాయచేస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడని అంటున్నారు. అతని కారణంగా ఉన్నతాధికారులు సైతం చిక్కుల్లో పడిన సంఘటనలు చాలానే ఉన్నాయని సిబ్బంది చెప్పటం అతని అవినీతికి నిదర్శనం.


