సొసైటీల్లో చేతివాటానికి చెక్ పెట్టాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సహకార సొసైటీల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకపోతే రైతులకు తీవ్ర అన్యాయం చేసినవారమవుతామని జిల్లాలోని పలువురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం నిర్వహించిన డీసీసీబీ మహాజన సభలో ఉండి సొసైటీ చైర్మన్ కనకరాజు సూరి మాట్లాడుతూ సొసైటీల్లో సిబ్బంది, పాలకవర్గం ప్రతినిధుల చేతివాటంతో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని పూర్తిగా అదుపు చేయాలని సూచించారు. రైతులకు త్వరగా రుణాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు నేస్తం షేరు ధనం కింద 10 శాతం కట్టించుకున్నారని, సొసైటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీరే తీసుకుంటే సొసైటీల మనుగడ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ములపర్రు సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమిషన్ పెండింగ్‌లో ఉందని, దానిని వెంటనే విడుదల చేయాలన్నారు. యర్రంపల్లి సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ సొసైటీల్లో వైట్‌కాలర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార వ్యవస్థలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా వారికిచ్చే రుణాలపై 12.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని, జాతీయ బ్యాంకుల్లో సైతం 7.5 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. మొగల్తూరు సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ అసైన్డ్ భూములకు గతంలో సొసైటీల ద్వారా రుణాలు ఇచ్చేవారమని ఇప్పుడు 1బీ, పట్టాదారు పాస్‌పుస్తకం ఉంటేనే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ నూతన త్రీ మెన్ కమిటీ ప్రతినిధులు సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
సమస్యలు ఏకరువు పెట్టిన చైర్మన్లు


