అమాని చెరువుతో ముంపు ఇక్కట్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆగిరిపల్లి మండలంలోని సగ్గూరు, చొప్పరమెట్ల, అమ్మవారిగూడెం, నరసింగపాలెం గ్రామ రైతులను అమాని చెరువు ముంపు సమస్య నుంచి కాపాడాలని బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధిత రైతు కోటగిరి వెంకట విజయ మురళీమోహనరావు మాట్లాడుతూ సగ్గూరులోని అమానిచెరువు నాలుగు గ్రామాల భూములను ముంపునకు గురిచేస్తోందన్నారు. 2024లో ముంపుతో తీవ్రంగా నష్టపోయామని, తాజాగా తుపాను తాకిడికి పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. చెరువు కళింగ ఎత్తు తగ్గించమని గతంలో కోరినా అధికారులు చర్యలు తీసుకోలేదని, కనీసం తూము కూడా తీయకపోవడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.


