శంకర మఠానికి మంచి రోజులు!
ఆక్రమణలు అడ్డుకోడానికి ట్రస్టీ నియామకం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరం ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ పర్యటనకు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు జిల్లా కేంద్రానికి వచ్చే ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఆశ్రయం కల్పించి వారికి ఆకలిదప్పులు తీర్చేందుకు అప్పట్లో నగరంలోని రామచంద్రరావుపేటలో శంకరమఠం 80 సంవత్సరాల క్రితం స్థాపించారు. అనంతరం రామచంద్రరావు పేట నగరంలోనే కీలక వ్యాపార కేంద్రంగా మారింది. అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. శంకరమఠానికి ఉన్న భూములను ఆ సంస్థకు ధర్మకర్తలుగా వ్యవహరించిన వారే తెగనమ్ముకోవడం ప్రారంభించారు.
శంకర మఠాన్ని 1946లో వడ్లమన్నాటి సుందరమ్మ అనే దాత స్థాపించారు. సుమారు 18 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. మఠం నిర్వహణకు ధర్మకర్తలను నియమించారు. శంకర మఠానికి తన పేరు పెట్టాలని, ఏలూరులో పర్యటించే పీఠాధిపతులు, వారి శిష్య పరివారం కోసం ఆశ్రమం నిర్మించాలని, వారికి భోజన సదుపాయాలు కల్పించాలని విల్లు రాశారు. శంకర మఠం నిర్మాణంలో ఉండగానే ఆమె మరణించారు. శంకర మఠాన్ని కొంతకాలం బాగానే నిర్వహించిన ధర్మకర్తలు సుందరమ్మ వారసుల పర్యవేక్షణ లేకపోవడంతో విల్లులో ఉన్న నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని సంస్థ ఆస్తులను విక్రయించడం మొదలుపెట్టారు.
విల్లును అనుకూలంగా మలుచుకుని అమ్మకం
దాత రాసిన విల్లు ప్రకారం రామచంద్రరావుపేట పడమర శ్రీఈశ్రీ వార్డులోని 3.06 ఎకరాల భూమిలో శంకర మఠం నిర్మించారు. దీని అభివృద్ధి కోసం 1948లో పత్తేబాద మోతే నరసింహరావు తోటకు పశ్చిమంగా (అశోక్ నగర్ ప్రాంతం) ఉన్న 8.32 ఎకరాల తమలపాకు తోటను రాసి రిజిస్టర్ చేయించారు. 1949 జనవరి 4న పెదపాడు మండలం సత్యవోలులోని మరో 8 ఎకరాల భూమిని మఠం అభివృద్ధి కోసమే రిజిస్టర్ చేయించారు. తన వంటమనిషి జాలమ్మ తనకు సేవలు చేస్తుండటంతో మెచ్చి సత్యవోలులోని 2 ఎకరాల భూమిని 1949లోనే రాసి ఆమె జీవిత కాలం అనుభవించవచ్చని, ఆమె మరణానంతరం ఆ భూమి శంకర మఠానికే చెందుతుందని విల్లు రిజిస్టరు చేయించారు. ఇవన్నీ ధర్మకర్తగా నియమించిన ఈదర వెంకట్రావు చేతిలో పెట్టారు. మఠం అభివృద్ధికి తాను రాసిన భూములను అవసరం మేరకు విక్రయించుకోవచ్చని విల్లులో పేర్కొన్నారు.
మఠం అభివృద్ధికి అవసరమైతే విక్రయించుకోవచ్చనే పాయింటు ఆధారంగా ధర్మకర్త తమలపాకు తోటలోని 8.32 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేయడంతో పాటు, సత్యవోలులోని 8 ఎకరాల భూమిని కూడా విక్రయించేశారు. దాంతోపాటు శంకర మఠం ఉన్న 3.06 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మఠం ఉన్న భూమి 581.77 చదరపు గజాలు మినహా మిగిలిన భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. 1972లో శంకరమఠం దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలో మఠం ఉన్న 581.77 గజాల స్థలాన్ని క్రయవిక్రయాలకు తావు లేకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న కొన్ని వందల గజాలను కూడా ఆక్రమించుకోవడానికి ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఈ మేరకు శంకర మఠం గోడను కూల్చి జేసీబీలతో చదును చేయించడం మొదలు పెట్టారు. విషయం తెలిసిన కొందరు దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఆక్రమణకు గురి కాకుండా ఆపగలిగారు. రెండ్రోజుల క్రితం ఈ సంస్థకు సింగిల్ ట్రస్టీని దేవదాయ శాఖ అధికారులు నియమించడంతో సంస్థకు మంచి రోజులు వచ్చేనా అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శంకర మఠం సంస్థ దేవదాయ శాఖ గెజిట్‌లో నోటిఫై అయ్యింది. దీనిలో ఆక్రమణలకు తావులేదు. ఇటీవల మఠంలోని ఖాళీ స్థలం ఆక్రమణకు ప్రయత్నించడం వాస్తవమే. ఆక్రమణలను నిరోధించడాకే మా శాఖ డిప్యూటీ కమిషనర్ ఈ మఠానికి సింగిల్ ట్రస్టీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కూచిపూడి శ్రీనివాస్,
దేవదాయ శాఖ అధికారి, ఏలూరు జిల్లా
కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఇప్పటికే అన్యాక్రాంతం
దేవదాయ శాఖ చేతిలోకి వెళ్లినా ఆగని ఆగడాలు
ఇటీవలే ట్రస్టీ నియామకం
శంకర మఠానికి మంచి రోజులు!


