
పోలవరం భూసేకరణ అక్రమాలను అడ్డుకుంటాం
ధవళేశ్వరం: పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అక్రమాలను అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లోని 20 గ్రామాల గిరిజనులు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. కాటన్ బ్యారేజీ సెంటర్ నుంచి వందలాది మంది ర్యాలీగా వెళ్లి, కార్యాలయం గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో ఇప్పటి వరకూ 5 నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రతి దానిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించలేదని, పెసా కమిటీల అనుమతులు సైతం లేకుండానే నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. గిరిజనుల సాగులో ఉన్న భూములను భూస్వాముల పేరిట రికార్డుల్లో నమోదు చేశారని చెప్పారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకుని, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రక్షణకు ఏర్పాటైన చట్టాల అమలులో పాలనా యంత్రాంగం విఫలమవుతోందన్నారు. పోలవరం భూసేకరణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని శ్రీనివాసరావు చెప్పారు. ప్రతి ఎకరాకు బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 1.05 లక్షల మంది నిర్వాసితులవుతున్నారని, ఇప్పటి వరకూ 12 శాతం మందికే పునరావాసం కల్పించారని, ఆలస్యంగా చేసినా అన్నీ అవకతవకలే వెలుగు చూస్తున్నాయని అన్నారు. ఆందోళన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి వి.అభిషేక్ వచ్చి గిరిజనులు, నాయకులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల అభ్యర్థనలను స్వీకరించారు. వాటిని పరిశీలిస్తామని, ఏలూరు జిల్లా కలెక్టర్, ఆర్‌డీఓలతో చర్చిస్తానని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మొడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.

పోలవరం భూసేకరణ అక్రమాలను అడ్డుకుంటాం