
రాష్ట్రంలో బీసీలకు రక్షణ కరువు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా బీసీసెల్ నాయకులు ప్రశ్నించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్‌పై టీడీపీ నేతలు జరిపిన దాడికి నిరసనగా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు ఆధ్వర్యంలో నగరంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ పాలనలో విఫలమై, సంక్షేమ పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల దృష్టి మళ్లించేందుకు పలు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. హామీలను విస్మరించిన ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతామనే భయంతో ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. కూటమి నేతలు ఇసుక కోసం, మట్టి కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని, అలాగే అనేక ప్రాంతాల్లో ప్రొటోకాల్ వి వాదాలు నడుపుతున్నారని, టీడీపీ, జనసేన నేతలు కాలర్లు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు. తమ పార్టీ నాయకులను నియంత్రించలేకపోతున్న రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏమి నియంత్రించగలుగుతారని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ప్రజలు తిరగబడక ముందే కూటమి ప్రభుత్వ పెద్దలు మేలుకోవాలని, లేకుంటే ప్రజలే వారిని తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. తొలుత నగరంలోని మహా త్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాసరావు, తుమరాడ స్రవంతి, మోదుగుండు సూర్యనారాయణ, నూకపెయ్యి సుధీర్ బాబు, గురజాల పార్థసారథి, కట్ట ఏసుబాబు, మున్నుల జాన్ గుర్నాథ్, కంచుమర్తి తులసి, కొల్లిపాక సురేష్, బోగాటి ప్రభాకర్, పాటినవలస రాజేష్, స్టాలిన్, సాయిల స్వాతి యాదవ్, గంటా సాయి ప్రదీప్, కిలాడి దుర్గారావు, జుజ్జువరపు విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.