ఏలూరు (టూటౌన్): న్యాయ సేవలపై అవగాహన కల్పించడంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బుధవారం బైక్ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై ప్రజలను అవగాహన కలిగిస్తున్నామని, బుధవారం కోర్టు ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మధ్యవర్తిత్వం వల్ల సత్వర ప్రయోజనం సమకూరుతుందని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులికృష్ణ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రఘునాథ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బి.జె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన
బుట్టాయగూడెం: అకారణంగా ఒక గిరిజనుడిని కొట్టడం వల్ల స్పృహ కోల్పోయాడని ఆగ్రహిస్తూ గిరిజనులు బుధవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. గిరిజనులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరన్నపాలెంకు చెందిన మహేంద్ర, ఓ యువతి ప్రేమించుకుని కొద్దిరోజుల క్రితం ఇళ్లు విడిచి వెళ్లిపోయారన్నారు. అయితే పోలీసులు మహేంద్ర ఆచూకీ చెప్పాలంటూ అతడి తండ్రి లక్ష్మణుడును విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చారన్నారు. మహేంద్ర ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ లక్ష్మణుడును పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి స్టేషన్ బయట వదిలేశారని ఆరోపించారు. ఆ సమయంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడన్నారు. లక్ష్మణుడును కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట రాత్రి గిరిజనులు ఆందోళనకు దిగారు. చివరకు సీఐ హామీతో ఆందోళన విరమించారు.
18న డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల నిరసన
భీమవరం: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు మెమో–57 అమలుచేస్తూ ఓపీఎస్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్సీ –2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూర్యప్రకాష్, బుధవారం ఒక ప్రకటన లో కోరారు. కేంద్రం ప్రకటించిన మెమోను అమలుచేయాలని కోరారు.
న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి