
కలిసిరాని పొగాకు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పొగాకు సాగు ఈ ఏడాది కలిసి రాలేదు. ఈ ఏడాది సగటున కిలో పొగాకుకు సగటున రూ.280 ధర లభించింది. పంట పెట్టుబడులు, బ్యారన్, కౌలు ధరలు పెరగడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం 1, 2, కొయ్యలగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలోని 73,758.52 ఎకరాల్లో పొగాకు పండించారు. వేలం కేంద్రాల వారీగా నమోదైన రైతులు, బ్యారన్ల సంఖ్య, మార్కెట్ డిమాండ్‌ను ప్రామాణికంగా తీసుకుని వేలం కేంద్రాల వారీగా సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలోనే పొగాకు బోర్డు 65,771.37 ఎకరాలను సాగు విస్తీర్ణంగా నిర్దేశించి.. 61.20 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అయితే.. 12,875 మంది రైతులు 14,978.84 బ్యారన్లను రిజిస్టర్ చేశారు. దీనికిగాను 80.72 మిలియన్ కేజీల దిగుబడి వచ్చింది. నిర్దేశించిన లక్ష్యం కంటే 7,987 ఎకరాల్లో అనధికారికంగా సాగు చేయడంతో 19.52 మిలియన్ కిలోల అదనపు దిగుబడి వచ్చింది.
అధిక సాగుతో రైతులకు కష్టాలు
ఈ ఏడాది మార్చిలో వేలం కేంద్రాలను తెరిచి పొగాకు కొనుగోళ్లు మొదలుపెట్టారు. అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో దిగుబడులు పెరిగి డిమాండ్ తగ్గింది. ఫలితంగా రైతులు పండించిన పొగాకు అమ్ముడుపోక కష్టాలు మొదలయ్యాయి. గతేడాది అత్యధికంగా కిలో రూ.411 ధర పలకగా.. సీజన్ మొత్తం సరాసరి ధర రూ.323గా నమోదైంది. అయితే ఈ ఏడాది సరాసరి ధర సగటున ఇప్పటివరకు రూ.280గా ఉంది. కేజీకి రూ.50 మించి రూ.70కి పైగా తక్కువతో సీజన్ ప్రారంభమైంది. 80 మిలియన్ కేజీల ఉత్పత్తికిగాను ఇప్పటివరకు 30 మిలియన్ కేజీల కొనుగోళ్లు పూర్తయ్యాయి. ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ధర దక్కక నష్టాల పాలవుతున్నారు.
గతేడాది మంచి ధరలు ఉండటంతో పెరిగిన సాగు విస్తీర్ణం
7,987 ఎకరాల్లో అనధికారిక సాగు
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 69 వేల ఎకరాల్లో పొగాకు సాగు
భారీగా పతనమైన ధరలతో రైతులు కుదేలు