మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..

Jul 1 2025 4:06 AM | Updated on Jul 1 2025 4:06 AM

మొక్క

మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..

చింతలపూడి : మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, సాగునీటి కింద పండిస్తారు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలో పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాల పంటగాను, కాయగూర రకంగాను రైతులు సాగు చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 వేల హెక్టారుల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఖరీఫ్‌ మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు వివరాలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వై సుబ్బారావు రైతులకు సూచించారు.

విత్తే సమయం

సాధారణంగా జూన్‌ 15 నుంచి జూలై లోగా విత్తుకోవాలి. అయితే వర్షాలు ఆలస్యంగా కురిస్తే నీటి వసతి కింద స్వల్పకాలిక హైబ్రీడ్‌ రకాలు ఆగస్టు రెండో వారంలో కూడా విత్తుకోవచ్చు.

అనువైన రకాలు

దీర్ఘకాలిక రకాలు: (100–120 ) రోజులు డీహెచ్‌ఎం –113, 900 ఎం గోల్డ్‌, బయో 9861, ప్రో–311, 30బి07

మధ్య కాలిక రకాలు : (90–100 రోజులు) డీహెచ్‌ఎం–111, 117, 119, కేహెచ్‌–510, బయో– 9657, కేఎం–9541, ఎంసీహెచ్‌–2

స్వల్పకాలిక రకాలు : (వీటి కాల పరిమితి 90 రోజుల కంటే తక్కువ) డీహెచ్‌ఎం– 115, ప్రకాశ్‌ కేహెచ్‌–5991, జేకేఎంఎచ్‌–1701 డీకేసీ–7074 ఆర్‌, ఎంఎంహెచ్‌–1701, డీకేసీ– 7074 ఆర్‌, ఎంఎంహెచ్‌– 133, 3342.

ప్రత్యేక రకాలు

తీపి మొక్కజొన్న (స్వీట్‌ కార్న్‌): మాధురి, ప్రియ, విన్‌ ఆరెంజ్‌, అల్మోరా స్వీట్‌ కార్న్‌ రకాలు, సుగర్‌–75, బ్రైట్‌జేన్‌ సంకర రకాలు.

విత్తే విధానం

ఎకరాకు సంకర రకాలైతే 7–8 కిలోల విత్తనం వాడి 60 సెం.మీ ఎడంగా బోదెలు చేసి సాళ్లలో 20 సెం.మీ ఎడంగా విత్తాలి. ఇలా విత్తితే ఎకరాకు సుమారు 33,333 మొక్కలు వస్తాయి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాస్టాన్‌ లేదా డైధేన్‌ ఎం.45 చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి బోదెకు ఒక పక్కగా విత్తాలి.

ఎరువుల వాడకం

ఖరీఫ్‌ పంటలో ఎకరాకు 72–80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వాడాలి. మొత్తం పొటాష్‌, భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఒకవేళ జింక్‌ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. పైరుపై జింక్‌లోపం గమనిస్తే జింక్‌ సల్ఫేట్‌ (20 గ్రా) పిచికారీ చేయాలి.

కలుపు నివారణ

పంట విత్తాక 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పంటను ఏక పంటగా వేసినప్పుడు నేల రకాన్ని బట్టి ఎకరాకు 800–1200 గ్రా, అట్రాజిన్‌ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లోగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చును. వెడల్పాటి కలుపు మొక్కల నివారణకు విత్తిన 30 రోజుల తర్వాత ఎకరాకు అరకిలో 2, 4–డి సోడియం సాల్ట్‌తో పిచికారీ చేయాలి.

నీటి తడులు

వర్షాధారంగా సాగు చేసినా పూత దశలో వర్షాభావ పరిస్థితులేర్పడితే వీలున్న చోట నీరు తడిపితే మంచి దిగుబడులు వస్తాయి. పూత దశ, గింజలు ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పైరు తొలి దశలో పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సస్యరక్షణ

పైరు తొలి దశలో ఆశించే మొవ్వ తొల్చే పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా విత్తిన 10–12 రోజులకు పైరుపై మోనోక్రోటోఫాస్‌ (1.6 మి.లీ) లేదా కోరా.ఎన్‌ (03 మి.లీ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు 25–30 రోజుల దశలో ఆకు సుడుల్లో వేయాలి.

ఆకు మాడు తెగులు నివారణకు మాంకో జెట్‌ (2.5 గ్రా) లీటర్‌ నీటిలో కలిపి వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే మొక్క దిగువనున్న 2–3 ఆకులు తుంచివేసి ప్రొపికొనజోల్‌ (1 మి,లీ) లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క ఎండు, కాండం మసికుళ్లు తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్తగా ఎదుర్కొనే రకాల సాగు, పంట మార్పిడి, వేసవిలో లోతు దుక్కులు, పూత దశ తర్వాత నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు చూసుకోవాలి.

పాడి–పంట

మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా.. 1
1/2

మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..

మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా.. 2
2/2

మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement