
నష్టాల ఊబిలో రొయ్య రైతు
గణపవరం: ఆక్వా రైతులను ప్రతికూల వాతావరణం ఇంకా వెంటాడుతోంది. దీంతో వేల ఎకరాలలో సాగులో ఉన్న రొయ్యలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నెలారంభం నుంచి ప్రతికూల వాతావరణ ప్రభావంతో రొయ్యలకు వైట్‌స్పాట్ (తెల్ల మచ్చ) వ్యాధితో పాటు ఈహెచ్‌పీ వ్యాధి కూడా తోడవడంతో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి రొయ్యసాగు అంతంత మాత్రంగానే ఉంది. గత జనవరిలో చెరువులలో సీడ్ వేసిన రైతుల్లో 80 శాతం కౌంట్‌కు రాకుండానే పట్టేశారు. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు.
మే, జూన్ నెలల్లో ప్రతికూల వాతావరణం
ఈ వేసవిలో రైతుల అంచనాలు తారుమారయ్యాయి. మే నెలలోనే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడిపోయింది. దీనితో రొయ్యలకు రకరకాల వైరస్‌లు సోకడంతో అర్ధాంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాలలో రొయ్య సాగు చేయగా సుమారు 8వేల ఎకరాలలో కనీసం 100 కౌంట్‌కు రాకుండానే పట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వాను ఆదుకుంటామని ఊదరగొట్టారు. రొయ్యలకు కనీస ధరలు ప్రకటించింది. మేతల ధరలు కూడా తగ్గిస్తున్నట్లు హంగామా చేశారు. ఇవేవీ రొయ్య రైతులకు అక్కరకు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు కొనుగోలు చేసిన దాఖలా లేదు. గత్యంతరం లేక అడిగిన ధరకే అమ్ముకోక తప్పని పరిస్థితి. 100 కౌంట్ రొయ్య రూ.220కు కొనాల్సి ఉన్నా రూ.200 లోపే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల కౌంట్ ధరలోనూ రూ.50 నుంచి రూ.70 వరకూ తగ్గించేశారు.
వైరస్ విజృంభణతో రైతు కుదేలు
ఈ ఏడాది వ్యాధులు విజృభించి ఆక్వా సాగును కుదేలు చేశాయి. ఏదైనా ఆయకట్టులో ఒక చెరువుకు వైరస్ వస్తే క్షణాల్లో ఆయకట్టులో మొత్తం చెరువులకు వ్యాపిస్తుంది. తక్షణం పట్టుబడి చేయకపోతే వ్యాధి సోకిన రొయ్యతోపాటు ఆరోగ్యంగా ఉన్న రొయ్యలూ దక్కకుండా పోతాయి. దీంతో రైతులంతా రొయ్యలు పట్టేసి అడిగిన ధరకు అమ్ముకున్నారు. గత పది రోజుల్లో గణపవరం, నిడమర్రు మండలాలలో వందల ఎకరాలలో చెరువులు ఖాళీ అయ్యాయి. వ్యాధులకు తోడు ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిప్పడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
వ్యాధుల విజృంభణతో అర్ధాంతరంగా పట్టేస్తున్న రైతులు
వ్యాపారులు సిండికేటు మారి గిట్టుబాటు ధర ఇవ్వని వైనం
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండేళ్లుగా రొయ్యల సాగు రైతులను కుదేలు చేస్తుంది. నాణ్యత లేని సీడ్, వ్యాధుల వ్యాప్తితో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం హడావుడిగా రొయ్యలకు ధర నిర్ణయించినా తర్వాత పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడంలేదు. ఒక పక్క లీజులు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, డీజిల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ పంట బాగుంటే వ్యాపారులు సిండికేట్‌గా తయారై రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు.
సంకు నాని, రొయ్య రైతు
నాణ్యమైన సీడ్ వేయాలి
ప్రస్తుత వాతావరణంలో వైరస్ వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రొయ్య సాగు ఆరంభంలోనే సర్టిఫైడ్ హేచరీస్ నుంచి నాణ్యమైన సీడ్ తెచ్చుకోవాలి. వైట్‌స్పాట్, ఈహెచ్‌పీ పరీక్షలు చేయించుకున్నాకే సీడ్ తీసుకోవాలి. సక్రమ యాజమాన్య పద్ధతులతో కొంతవరకూ వ్యాధులు రాకుండా చూడవచ్చు. వైట్‌స్పాట్ వస్తే ఇమ్యూనిటీ పెంచడానికి విటమిన్ సీ, ప్రోబయోటిక్స్ వాడాలి. ఈహెచ్‌పీ వస్తే వెంటనే పట్టుబడి చేసుకోవాలి.
– శివరామకృష్ణ, ఎఫ్‌డీవో, గణపవరం

నష్టాల ఊబిలో రొయ్య రైతు

నష్టాల ఊబిలో రొయ్య రైతు

నష్టాల ఊబిలో రొయ్య రైతు