
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక
నూజివీడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. మండలంలోని సుంకొల్లులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుంచి 10 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో ప్రతాప్ అప్పారావు సమక్షంలో చేరాయి. వారికి ప్రతాప్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన కొనకాల సీతారామయ్య, కొనకాల అజయ్, బుడిపూడి శ్రీనివాసరావు, బుడిపూడి శ్రీరాములు, పలగాని జమలయ్య, కొనకాల రమేష్, కొనకాల రామకోటేశ్వరరావు, వలిపి గోపి, లంకా పెదబాబు, గుడివాడ ఏసు లు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేశానని చెప్తున్నప్పటికీ వాస్తవంగా తూతూ మంత్రంగా అమలు చేసిందని విమర్శించారు. ఒకటో తరగతి విద్యార్థులు, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈనెల 20న అమలు చేస్తున్నామని, రైతుల అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు ఈ పథకం లేదని చెబుతూ ప్రభుత్వం కోతలు పెడుతోందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారిని తొలగించారన్నారు. ఇంటింటికి రేషన్ సరుకులను అందిస్తున్న రేషన్ వాహనాలను ప్రభుత్వం తొలగించి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. కొన్ని చోట్ల మూడు, నాలుగు కిలోమీటర్లు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఎక్కడని, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడని ప్రతాప్ నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాలండర్‌ను ప్రకటించి దాని ప్రకారం చెప్పిన తేదీకి పథకాన్ని అమలు చేశారన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం గాని ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసే ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే కూటమి పార్టీలను రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. మట్టిని, ఇసుకను దోచేస్తున్నారన్నారు. తాను ఓడినా, గెలిచినా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమానికి ప్రతాప్ అప్పారావును బైక్ ర్యాలీతో గ్రామంలోకి తీసుకెళ్ళారు. కార్యక్రమంలో సర్పంచి దుడ్డు నాగమల్లేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, నాయకులు గబ్బర్, బసవా వినయ్, కంచర్ల లవకుమార్, బసవా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు