
విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు గడువు అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో నూతన పాఠశాలల వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి వచ్చే ఏడాది వరకూ గడువు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నూతన పాఠశాలల వ్యవస్థలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పన నియమిస్తూ మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేశారని, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉండాలని నిబంధన విధించారన్నారు. వేసవి సెలవుల్లోనే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకున్నారని, బదిలీలు అనంతరం కొత్తగా వెళ్ళిన ఉపాధ్యాయులకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడానికి పిల్లలు లేరన్నారు. ఇప్పుడిప్పడే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు నియమించారన్న విషయాలను గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, తల్లిదండ్రులకు తెలియజేసి, ప్రైవేటు పాఠశాలల నుంచి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల మోడల్ ప్రైమరీ స్కూల్లో 60 పైబడి ఉండాలన్న నిబంధన/లక్ష్యం వచ్చే విద్యాసంవత్సం వరకు పొడించాలన్నారు. ఉపాధ్యాయులు కొత్తగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 16న జాయిన్ అయ్యారని, అంటే వారు చేరి కేవలం పదమూడు రోజులు మాత్రమే అయ్యిందని, ఇంతలోనే పని సర్దుబాటు ద్వారా ఇప్పటి విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను ఉంచుతామన్న విధానం సరైంది కాదన్నారు.
శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ముగ్గురు భక్తులు వేరువేరుగా ఆదివారం రూ. 3,11,351 విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంనకు చెందిన దండుబోయిన వీరవెంకట సర్వేశ్వరరావు రూ.1,00,116, ఖమ్మం జిల్లా సత్యన్నారాయణపురంనకు చెందిన చాపలమడుగు దానేశ్వరరావు రూ.1,00,116, ఏలూరుకు చెందిన మారుశీళ్ల కృష్ణారావు రూ.1,11,119 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం దాత కుటుంబాలకు స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు.
గుంతల రోడ్డుపై వరి నాట్లు
కలిదిండి(కై కలూరు): గుంతల రహదారికి మరమ్మత్తులు చేయాలంటూ సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. కలిదిండి మండలం మూలలంక నుంచి పెదలంక రోడ్డును వెంటనే నిర్మించాలంటూ ఆదివారం పెదలంక వరి నాట్లు వేశారు. సీపీఎం కలిదిండి ప్రాంతీయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు మాట్లాడుతూ పాడైపోయిన రోడ్లు మొత్తం బాగు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. మూలలంక– పెదలంక రోడ్డు గుంతల మయంగా మారి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు.