
వరాహావతారంలో జగన్నాథుడు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జగన్నాథుడు శ్రీ వరాహావతారంలో సాక్షాత్కరించారు. జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శంకు చక్రాలను ధరించి, అమ్మవార్లతో ఆశీనులై ఉన్న స్వామివారి అలంకారం భక్తులకు కనువిందు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పెద్దింట్లమ్మా.. చల్లంగా చూడమ్మా
కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్పులు అందించమ్మా అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తీతో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు చేసి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.68,010 ఆదాయం వచ్చిందని తెలిపారు.
జూదరుల అరెస్టు
దెందులూరు: దెందులూరులో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి దెందులూరు యందంవారి వీధి డంపింగ్ యార్డ్ వద్ద పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6100 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

వరాహావతారంలో జగన్నాథుడు