
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జూలై 9న జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఏలూరు ఏరియా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏఐటీయూసీ ఏలూరు ఏరియా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత మే 20న జరగాల్సిన దేశవ్యాప్త సమ్మె యుద్ధ వాతావరణం వల్ల వాయిదా పడిందని గుర్తు చేశారు. తిరిగి జూలై 9న జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్‌లుగా మార్చిందన్నారు. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు నుంచి, వేతన ఒప్పందాల వరకు యజమానులకు అనుకూలంగా, కార్మికులకు కఠినతరంగా లేబర్ కోడ్లు ఉన్నాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యావత్తు కార్మిక వర్గం సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలే కాకుండా రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సమస్యలపై జరుగుతున్న ఈ సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ.అప్పలరాజు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి.కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్ మాట్లాడారు. సమావేశంలో ఏరియా నాయకులు బరగడ పోతురాజు, ఎలగాడ శివకుమార్ , పుప్పాల శ్రీనివాస్, బోడెం వెంకట్రావు, వీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.