
అప్పులు తప్ప హామీల అమలేదీ?
భీమవరం: కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ కాదని, ట్రబుల్ ఇంజిన్ అని విమర్శించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో పాలనను సూపర్ ఫ్లాప్ చేశారని, ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఒక్కటిచ్చి పథకాలన్నీ అమలు చేశామని చెబుతున్నారని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకం కింద 20 లక్షల మంది పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అన్నదాత దుఃఖీభవ చేశారని విమర్శించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి పాలక్ వర్మ, జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమారరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.