
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,42,813 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
పోక్సో కేసు కొట్టివేత
బుట్టాయగూడెం: 13 ఏళ్ల క్రితం నమోదైన పోక్సో కేసు నేరారోపణ రుజువు కాకపోవడంతో జిల్లా జడ్జి కొట్టివేసినట్లు న్యాయవాది ఉద్దండం ఏసుబాబు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన టి. పోతురాజు అదే గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు 2017 ఆగస్టులో ఎఫ్‌ఐఆర్ నమోదైందని చెప్పారు. మొత్తం 18 మందిని విచారించి నేరారోపణ చేశారన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం పోక్సో స్పెషల్ కోర్టులో విచారణ జరిగిందని, ముద్దాయిపై నేరారోపణ రుజువు చేయలేకపోయినందున, ముద్దాయిపై పెట్టిన పోక్సో కేసును కొట్టి వేస్తూ జిల్లా జడ్జి కుమారి వాణిశ్రీ తీర్పు వెలువడించారని ఏసుబాబు పేర్కొన్నారు.
మద్యం మత్తులో వ్యక్తిపై దాడి
ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో దాడి చేసి వ్యక్తిని గాయపరచిన సంఘటన మండలంలోని సింగరాయపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గుజ్జు లాజర్‌బాబు కూలి పనికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా సాంబశివరావు మద్యం సేవించి లాజర్‌బాబును దూషించాడు. దీనిపై నిలదీసి అడగగా రాయితో తలపై దాడి చేసి గాయపరిచినట్లు లాజర్‌బాబు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.