
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు
ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్‌పాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో దిగింది. సమీపంలోని తమ్మిలేరుులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కార్మికులు వెంటనే స్పందించి ఆమెను, పిల్లలను బయటకు తీసుకొచ్చారు. పిల్లలు నీళ్ళు తాగారేమో అనే అనుమానంతో ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా.. ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్‌పాల్, మహిళ అన్న ఏలూరు చేరుకున్నారు. రైల్వే పోలీసులు జీజీహెచ్‌కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్‌పాల్‌కు అప్పగించారు.