
దేవుడి విగ్రహాల ఏర్పాటుపై రగడ
నూజివీడు: మండలంలోని పాత రావిచర్లలో దేవుడి విగ్రహాల రగడ ఉద్రిక పరిస్థితులకు దారితీసింది. గ్రామంలోని ప్రధాన సెంటర్‌లో ఉన్న పంచాయతీకి చెందిన లైబ్రరీ బిల్డింగ్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక వర్గం వారు కృష్ణుడి విగ్రహాన్ని పెట్టారు. మూడు రోజులైనా విగ్రహాన్ని తీయకపోవడంతో గ్రామస్తులంతా కలిసి అదే లైబ్రరీలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వినాయకుడి విగ్రహం, అమ్మవారి విగ్రహాలను వేదమంత్రాల నడుమ మేళతాళాలతో ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో విగ్రహాల ఏర్పాటు విషయం వర్గపోరుగా మారి లైబ్రరీ వద్దకు వందలాది మంది గ్రామస్తులు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఈ విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగారు. మాజీ సర్పంచి బసవరాజు నగేష్ అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పంచాయతీ భవనంలో విగ్రహాలు పెట్టడమేంటని ప్రశ్నించారు. రూరల్ ఎస్‌ఐ జ్యోతిబసు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. గ్రామ పెద్దలు ఎంతగా సర్ది చెప్పినా.. ఆయా వర్గీయులు ఏమాత్రం వినకుండా విగ్రహాలు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు. మాజీ సర్పంచ్ ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసుల బందోబస్తు మధ్య విగ్రహాలను తొలగించడంతో సమస్య తొలగిపోయింది.