
జల విద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్‌కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్‌కుమార్ అన్నారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జెన్‌కో అధికారులు కాంట్రాక్టు సంస్థకు సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫరం వాల్, ఈసీఆర్‌ఎఫ్ పనులకు సమాంతరంగా విద్యుత్ కేంద్రం పనులు చేపట్టాలన్నారు. శుక్రవారం పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన 150/30 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రేన్ పనితీరును పరీక్షించి పూజలు చేసి సుజయ్‌కుమార్ ప్రారంభించారు. జల విద్యుత్ కేంద్రంలో టర్బయిన్‌లు, జనరేటర్ వంటి కీలకమైన పరికరాలను బిగించేందుకు ఈ క్రేన్‌ను ఉపయోగిస్తారు. త్వరలో 225/40 టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు క్రేన్‌లను ఏర్పాటు చేస్తామని ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు అంగర తెలిపారు. టర్బయిన్లు, జనరేటర్లను బిగించే పని త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో హెచ్‌పీసీసీ ఈ.నాగరాజు, సీఈ (సివిల్) రవీంద్రారెడ్డి, ఎస్‌ఈ (సివిల్) రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.