
రోడ్ల అవస్థపై గ్రామస్తుల నిరసన
కొయ్యలగూడెం : రహదారి అధ్వానంపై పొంగుటూరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పొంగుటూరు, యర్నగూడెం గ్రామాల మధ్య పదిహేను కిలోమీటర్ల మేర ఉన్న రహదారి భారీ గోతులు పడి ప్రమాదకరంగా మారింది. గ్రీన్ ఫీల్డ్ హైవే వాహనాలు పరిమితికి మించి మెటీరియల్ రవాణా చేయడం వల్లే రోడ్డు పాడైంది. రెండేళ్ల క్రితం సుమారు రూ.30 లక్షలతో కన్నాయగూడెం నుంచి పొంగుటూరు వరకు రహదారిని నిర్మించగా పూర్తిగా పాడైంది. స్కూల్ బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని యాజమాన్యం రాకపోకలు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి రహదారి అభివృద్ధి చేపట్టాలని కోరారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్విని మహిళలు కోరారు. ఈ ఆందోళనకు రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు.
ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడిగా మురళీకృష్ణ
భీమవరం : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తాడేపల్లిగూడెం సాక్షి విలేకరి యడ్లపల్లి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఒంగోలులో మూడు రోజుల పాటు నిర్వహించిన యూనియన్ 36వ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీఎస్ సాయిబాబా, గజపతి వరప్రసాద్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు బెల్లంకొండ బుచ్చిబాబు, ముత్యాల శ్రీనివాస్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
గేదెలను చంపిన దుండగులు
లింగపాలెం: మండలంలోని మఠంగూడెం శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గేదెలను దుండగులు తలలు నరికి చంపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలో తొర్లపాటి రవి పశువుల పాకలో మూడు గేదెలను గురువారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు క్రూరంగా తలలు నరికి చంపారు. శుక్రవారం ఉదయాన్నే గుర్తించిన రైతు రవి ధర్మాజీగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు.

రోడ్ల అవస్థపై గ్రామస్తుల నిరసన

రోడ్ల అవస్థపై గ్రామస్తుల నిరసన