
అచ్చియ్యపాలెంలో విషాద ఛాయలు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెం(చిన్నరవ్వారిగూడెం)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈతకొట్టేందుకు వెళ్ళి మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతి చెందిన తెల్లం సీతారామరాజు, తెల్లం కిశోర్‌లు అన్నదమ్ములు. తండ్రి తెల్లం పోసీరావు గోపాలపురం మండలం సాకిపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడు సీతారామరాజుకు 2021 కరోనా సమయంలో వివాహమైంది. సీతారామరాజుకు భార్య, 4 నెలల పాప ఉంది. చిన్న కొడుకు కిశోర్ జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరు కుమారుల మృతితో తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. మృతుడు మాడి దేవేంద్రకుమార్ తండ్రి మాడి సోమరాజు వ్యవసాయ కూలీ. సోమరాజుకు ఇద్దరు కుమారులు. సోమరాజు మొదటి కుమారుడు చిన్నతనంలోనే కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. దేవేంద్ర విజయవాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సరదా కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. యువకుల మృతి సమాచారం తెలుసుకున్న జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, బుట్టాయగూడెం ఎస్సై దుర్గామహేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారు మాట్లాడుతూ ఈతకు ఐదుగురు వెళ్ళారని ఈత రాని కారణంగా ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని చెప్పారు. దండిపూడి సమీపంలో ఉన్న కాల్వ సమీపానికి ఎవరూ కూడా ఈత కోసం వెళ్ళొద్దని సీఐ చెప్పారు. గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, వర్షాల కారణంగా అవి కొట్టుకుపోయాయని చెప్పారు. మళ్లీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం తరలించామని తెలిపారు.