
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
స్పీడ్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు
ఏలూరు టౌన్ : బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట కాలనీలో ఏడాదిన్నర క్రితం బాలికపై లైంగిక దాడికి పాల్పడిన షేక్ ఇబ్రహీంకు 20 ఏళ్ళ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏలూరు స్పెషల్ కోర్టు ఫర్ స్పీడ్ ట్రయల్ ఆఫ్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్ కోర్టు న్యాయమూర్తి కే.వాణిశ్రీ తీర్పు చెప్పారు. బాధిత బాలికకు రూ.50 వేల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం సాయిబాబా గుడి వెనుక సుబ్బంపేట కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను బాధిత బాలిక పాఠశాలకు, ట్యూషన్‌కు వెళ్ళే సమయాల్లో తినుబండారాలు ఇస్తూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2024 ఫిబ్రవరి 6కు ముందు అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావటం గమనించిన నానమ్మ బాలికను ప్రశ్నించగా.. భయపడుతూ విషయాన్ని చెప్పింది. 2024 ఫిబ్రవరి 10న నానమ్మ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ జ్యోతిబసు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం.ధనుంజయడు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. పోక్సో కోర్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది వీ.అమర శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఇబ్రహీంకు 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితులకు కఠిన శిక్షలు పడడంతో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు.