
కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు : కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాదక ద్రవ్యాలు (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఆ ఇద్దరు అధికారులు అశువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉన్నాడన్న సమాచారంతో అతడ్ని పట్టకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఆలమూరు ఎస్సై అశోక్, ఆత్రేయపురం కానిస్టేబుల్ ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామి, డ్రైవర్ జి.రమేష్ కారులో హైదరాబాద్ బయలు దేరారు. కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్దకు వచ్చేసరికి వారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామికి తీవ్ర గాయాలయ్యాయి.
నరసాపురంలో విషాదఛాయలు
నరసాపురం: ఆలమూరు ఎస్సై ముద్దాల అశోక్ మృతిపై నరసాపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మృతేహాన్ని గురువారం సాయంత్రం స్వస్థలమైన నరసాపురం తీసుకొచ్చారు. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అశోక్‌కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వశిష్ట గోదావరి గట్టున ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ వారంరోజుల క్రితం ఇక్కడకు వచ్చాడని, ఆ రెండు రోజులుచాలా సరదాగా గడిపినట్టు గుర్తు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన