
ఈవీఎం గోడౌన్ తనిఖీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్‌న్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు.
మా పాఠశాలను
విలీనం చేయొద్దు సార్
భీమవరం అర్బన్: మా పాఠశాలను విలీనం చేయొద్దని దెయ్యాలతిప్పలోని ఎస్సీ పేటకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలక్టరేట్‌లోని డీఆర్‌వో మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఎస్సీ పేటలో ఉన్న పాఠశాలను బీసీ పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు మొర పెట్టుకున్నారు. గతంలో బీసీ పేటలోని వ్యక్తులకు తమ పేటలోని వ్యక్తులకు గొడవలు అయ్యాయని, ఇప్పుడు విలీనం చేయడం వల్ల మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని వినతిపత్రంలో ఎస్సీ పేట వాసులు తెలిపారు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఆర్‌వో హామీ ఇచ్చారు.
ఎంఈఓ విచారణ
దెందులూరు: గోపన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో ఏవీఎన్‌వీ ప్రసాద్ బుధవారం విచారణ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు ఆటలాడుతుండగా ఒక విద్యార్థి వేలుకి గాయమైంది. దీనిపై సమాచారం అందిన ఎంఈవో ప్రసాద్ పాఠశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదని ఎంఈఓ తెలిపారు. హెచ్‌ఎం డాక్టర్ ఎం మనోహర్, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి మహేష్ యాదవ్, మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు) తదితరులు ఉన్నారు.

ఈవీఎం గోడౌన్ తనిఖీ