
ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు విఫలం
ద్వారకాతిరుమల: ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో రోడ్డు పక్కనున్న స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. ద్వారకాతిరుమల క్షేత్రంలో డీసీసీ బ్రాంచి ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్ర గాయాలుపాలు కాగా, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు క్షేత్రంలోని గుడి సెంటర్ నుంచి సుమారు 70 మంది యాత్రికులతో తణుకుకు బయల్దేరింది. ప్రారంభంలోనే బస్సు బ్రేక్‌లు విఫలమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బస్సును పక్కకు తిప్పాడు. దాంతో బస్సు దేవస్థానం స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో ఉన్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనతో కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన వృద్ధురాలు ప్రభావతి తీవ్రంగా, డ్రైవర్ శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ఎలివేషన్ కొంత భాగం, బస్సు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రభావతికి స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు ప్రవీణ్‌కుమార్ ప్రథమ చికిత్స చేశారు. కాగా స్థానికులు, భక్తులతో రద్దీగా, పల్లంగా ఉన్న ఈ ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాత్రికులంతా వేరువేరు బస్సుల్లో స్వగ్రామాలకు తరలివెళ్లారు.
స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టిన బస్సు
వృద్ధురాలికి తీవ్ర, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం

ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు విఫలం

ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు విఫలం