
గడువు దాటితే ముప్పే
ఇవి తెలుసుకోవాలి
గ్యాస్ సిలిండర్‌పై వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో తమ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలని డీలర్ కోరవచ్చు. అయితే డీలర్ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీలేదు. అంతేగాక గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు సిలిండర్ ఉచితంగా డోర్ డెలివరీ చేయాలి.
ద్వారకాతిరుమల : గ్యాస్ మీద వంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో.. సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం. గ్యాస్ సిలిండర్లకూ కాలపరిమితి ఉంటుందని, దానిని గమనించాలని నిపుణులు చెబుతున్నారు. గడువు తేదీ ముగిసిన సిలిండర్లు వినియోగిస్తే గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై గడువు తేదీ కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై ముద్రిస్తాయి. సిలిండరు మార్చుతున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకుని వినియోగించాలి.
ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు
సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్‌పై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని గుర్తించాలి. గడువు తేదీ ముగిసినా.. నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్‌పై ఉంటే దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్‌ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారులకు ఉంది.
ఇలా గుర్తించాలి
ఉదాహరణకు సిలిండర్ మెటల్ ప్లేట్‌పై ఏ–28 అని ఉంటే, ఆ సిలిండర్ 2028 మార్చికి ఎక్స్‌పైర్ అవుతుందని అర్థం. 28 అంకె సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఏ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బీ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలలను సూచిస్తాయని గుర్తించాలి.
పదేళ్ల గడువు
సిలిండర్ తయారైనప్పటి నుంచి పదేళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. బీఐఎస్ అనుమతులు తీసుకున్న తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది.
కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే చర్యలు
కాలం చెల్లిన సిలిండర్లు సరఫరా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు చేపడతామని తహసీల్దార్ జేవీ సుబ్బారావు తెలిపారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు తీసుకునేటప్పుడు వాటిపై కోడ్ రూపంలో ఉండే ఎక్స్‌పైరీ డేట్‌లను చూసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.
వంట గ్యాస్ సిలిండరుకు కాలపరిమితి
గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి

గడువు దాటితే ముప్పే