దెందులూరు: ఏలూరు వెళ్లే రహదారిపై వీరభద్రపురం వద్ద శనివారం యువకుడి దారుణహత్య కలకలం రేపింది. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పాములదిబ్బకు చెందిన ఎం.ఎర్రబాబు (30) ద్విచక్ర వాహనంపై గోపన్నపాలెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారులో వచ్చిన కొంతమంది వీరభద్రపురం వద్ద ఎరబ్రాబును కిరాతకంగా నరికి చంపారు. సంఘటన స్థలాన్ని పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ పరిశీలించారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ యువకుడి హత్యపై కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎర్రబాబును నిందితులు గోపన్నపాలెం నుంచి కారులో అనుసరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కారులో మొత్తం ఆరుగురు ఉన్నారని, హత్య తర్వాత వారు ఏలూరు వైపు వెళ్లిపోయారని తెలుస్తుంది. పాతకక్షల నేపథ్యంలో ఎర్రబాబు హత్య జరగిందని, నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు సమాచారం.
రైలు నుంచి జారి పడి వృద్ధుడి మృతి
భీమడోలు: రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన అల్లూరి సత్యనారాయణ(69) రైలులో ప్రయాణిస్తుండగా జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధాయించారు. ఘటన స్థలంలోని మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.