జీజీయూలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు
రాజానగరం: ఆస్ట్రేలియాలోని మెక్వెరీ యూనివర్సిటీ, ప్రముఖ సంస్థ కేపీఎంజీ ఇండియాలతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) అవగాహన ఒప్పందాలు చేసుకుంది. యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించిన పత్రాలపై ప్రొ.ఛాన్సలర్ కె.శశికిరణ్‌వర్మ, కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో బోధన అందించేందుకు జీజీయూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రొ.ఛాన్సలర్ శశికిరణ్‌వర్మ మాట్లాడుతూ దీని ద్వారా బీటెక్‌లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ చేసేందుకు అవకాశాలుంటాయన్నారు. కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి మాట్లాడుతూ, డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో జీజీయూతో కలిసి పని చేయడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవితను అందించే అవకాశం లభించిందన్నారు. మెక్వెరీ యూనివర్సిటీ సైబర్ స్కిల్ అకాడమీ సీఈఓ మాట్ బుష్‌బై ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేపీఎంజీ ఇండియా ప్రతినిధులు మహావీర్, రాఘవన్ ఎస్, జీజీయూ సాంకేతిక సలహాదారు సుమంత్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, డీన్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల తనిఖీ
జంగారెడ్డిగూడెం: నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం పట్టణంలోని ఏడు భవనాలను రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. టౌన్ ఫ్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్న, టీపీఏ రమణ, స్థానిక టీపీవో చాందిని, సచివాలయ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించారని, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తారని చాందిని తెలిపారు.


