
ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ వాయిదాకు డిమాండ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 27 నుంచి తలపెట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణను వాయిదా వేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు సమగ్రశిక్ష ఏలూరు జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.పంకజ్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని డీఆర్‌పీలకు ఓడరేవులో నిర్వహించే శిక్షణకు హాజరుకావాలని.. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకునే పనిలో ఉన్న వారు ఈ శిక్షణకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్‌కు వివరించగా ఆయన స్పందిస్తూ వీలుపడిన వారు మాత్రమే హాజరు కావచ్చని, వీలుపడని వారు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారన్నారు. అయినప్పటికీ జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు శిక్షణకు వెళ్ళాలని ఒత్తిడి తెస్తున్నారని, ఈ మేరకు ఎంఈఓలకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.