
ములపర్రు సొసైటీలో మరోసారి కలకలం
పెనుగొండ: డిపాజిట్లు గల్లంతుతో 2018 నుంచి కలకలం రేపుతున్న ములపర్రు హిందూ ముస్లీం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మరోసారి కలకలం రేపింది. మంగళవారం సీఐడీ పోలీసులు ఆనాటి అధ్యక్ష, కార్యదర్శులను అదుపులోకి తీసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. 2017 సంవత్సరం పాలకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఆనాటి కార్యదర్శి వెంకటేశ్వరరావు నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారంటూ పాలకవర్గంలోని డైరక్టర్లే ఆనాడు రోడ్డేక్కారు. దీంతో డిపాజిట్టుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి డిపాజిట్లు తిరిగి చెల్లించాలంటూ ప్రదక్షిణలు చేశారు. అప్పట్లోనే 51 ఎంక్వయిరీ వేసి పలుమార్లు విచారణ జరిపి, ఎంత మోసం జరిగిందో బయటపెట్టకుండా కాలం వెళ్లబుచ్చారు. రూ.50 లక్షల నుంచి రెండ్లు కోట్లకుపైగా అంటూ రకరకాలుగా ప్రకటించే వారు. చివరకు డిపాజిట్టు దారుల ఒత్తిడి పెరగడంతో అప్పటి కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం సైతం చేశారు. అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో కేసు ముందకు సాగకుండా యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కొందరి పెద్దల సమక్షంలో రాజీ కుదర్చుకొని కొంత మేర నగదు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ తరుణంలో ఓ డిపాజిట్టు దారుడు హైకోర్టును ఆశ్రయించడంతో, పూర్తి స్థాయి విచారణ జరిపి నిగ్గు తేల్చాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం రూ.రెండు కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని గుర్తించినట్లు సమాచారం.
తణుకులో అదుపులోకి ?
మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి వెంకటేశ్వరరావులను మంగళవారం తణుకులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ములపర్రు సొసైటీ డిపాజిట్లు దుర్వినియోగం కేసు కలకలం రేపింది.
సీఐడీ అదుపులో మాజీ అధ్యక్ష, కార్యదర్శులు