
జూన్ 10న ఆక్వా రైతుల చలో అమరావతి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం హెచ్చరించినా ధరల విషయంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ కంపెనీలు దిగిరావడం లేదని, దీంతో ఆక్వా రైతులందరూ చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు తెలిపారు. మంగళవారం పాలకొల్లు మండలం పూలపల్లి ఎస్‌ఎస్‌ఎస్ కళ్యాణ మండపంలో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాంధీభగవాన్ రాజు మాట్లాడుతూ అమెరికా పన్నులు పెంచిందని ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ సభ్యులు కొనుగోలు నిలుపుదల చేశారని తెలిపారు. సరుకు పట్టుబడులు పట్టుకున్న రైతులు గగ్గోలు పెడితే రూ.50 నుంచి రూ.100 వరకూ ధరలను తగ్గించేశారని అన్నారు. దీనిపై జై భారత్ ఆక్వా సంఘం స్పందించి ఎంతో పోరాటం చేసి క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందన్నారు. క్రాఫ్ హాలీడేకు మద్దతుగా ఇప్పటికే పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో రైతులు చెరువులను ఎండగట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అలాగే ఫీడ్ కంపెనీలు ముడి సరుకు ధరలు పెరిగితే వెంటనే రూ. 25 పెంచేసి, ధరలు తగ్గినప్పుడు కేవలం రూ.4 లేక రూ.5 తగ్గించడం దారుణమన్నారు. 60 కౌంట్‌ను మినిమమ్‌గా నిర్ణయించాలని, ధర రూ.320 చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయకుంటే క్రాఫ్ హాలీడే తథ్యం అని స్పష్టం చేశారు. చలో అమరావతి కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బోణం చినబాబు, బోణం రంగయ్యనాయుడు, ఆర్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్న ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు
క్రాఫ్ హాలిడేకు మద్దతుగా రైతులు సమాయత్తం