
పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకులతిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచన, మేదిని పూజ, మృత్ సంగ్రహణము, అంకురారోపణము తదితర వైదిక కార్యక్రమాలతో శ్రీ వైఖానసాగమోక్తంగా ఉత్సవాలు ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీనివాసుడిని పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు.