
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. వాతావరణంలో మార్పులతో భక్తులు త్వరగా దర్శనాలు చేసుకుని బయటకు వెళ్ళాలని కమిటీ వారు సూచించారు. సాయంత్రం 4 గంటలలోపే భక్తులందరూ తమ పూజా కార్యక్రమాలను ముగించుకుని బయటకు వచ్చారు.
శ్రీవారి క్షేత్రంలో కొనసాగిన రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ ఆదివారం సైతం కొనసాగింది. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దాంతో అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. వేంకటేశ్వర స్వామివారిని తూర్పుగోదావరి జిల్లా అడిషినల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గణపవరం: గణపవరం మండలం సరిపల్లె శివారు ఫ్యాక్టరీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం కల్లిగొట్ల గ్రామానికి చెందిన బిరుదగడ్డ సాల్మన్, దాసరి మురళి ఆదివారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై గణపవరం వస్తుండగా సీపీ మేతల కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో సాల్మన్ అక్కడిక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన దాసరి మురళిని అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మణికుమార్ తెలిపారు.

గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు

గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు