
మట్టి లారీలపై గ్రామస్తుల ఆందోళన
కొయ్యలగూడెం: మండలంలోని దిప్పకాయలపాడు శివారు దళిత పేటలో మట్టి తోలకాలను అడ్డుకుని స్థానికులు ఆందోళన చేశారు. ఆదివారం సాయంత్రం దాదాపు యాభై మందికి పైగా యువకులు మట్టి తోలకాల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయంటూ వాగ్వాదానికి దిగారు. సుమారు పాతికకు పైగా లారీలను నిలిపేసి రోడ్డుపై బైఠాయించారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం లారీలు ప్రయాణిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలు బయట ఎక్కువగా తిరుగుతున్నారని, ఈ లారీల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకొని, మట్టి లారీల రవాణాపై నియంత్రణ విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జలవనరుల శాఖ సబ్ డివిజన్ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రచారం సాగుతోంది.