కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలందించేలా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల సమయంలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేన్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని, చిన్నపాటి రోగాలకూ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయకుండా చికిత్స అందించాలన్నారు.
పీజీఆర్‌ఎస్ వికేంద్రీకరణ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లాస్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమీపంలోని కార్యాలయాలకు వెళ్లి అర్జీలు అందించవచ్చని సూచించారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 629 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 629 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 175 మంది, మధ్యాహ్నం 180 మందికి 174 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 144 మందికి 140 మంది, మధ్యాహ్నం 144 మందికి 140 మంది హాజరయ్యారు.
నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక అన్నే భవనంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నిమ్మకాయల ధర పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి నుంచి మే వరకు నిమ్మకు అధిక ధర ఉండే సమయమని, అయినా ప్రస్తుతం ధర తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు ఈదురుగాలులు, అకాల వర్షాలతో నిమ్మ రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మ ఎగుమతులు సక్రమంగా లేకపోవడం కూడా నష్టాలకు కారణంగా ఉందని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కిలో నిమ్మకాయలకు రూ.100 ధర రావాల్సి ఉండగా రూ.30లోపు మాత్రమే ఉందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యుడు జి.సురేష్ పాల్గొన్నారు.
భారీ వర్షాలపై అప్రమత్తం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
ఏలూరు(మెట్రో): కోస్తా జిల్లాల్లో రా నున్న మూడు రో జులపాటు భారీ వ ర్షాలు కురుస్తా యన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 1800 233 1077తో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా రెవెన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండల, డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌ను ప్రజలు వినియోగించు కోవాలని కోరారు.

ప్రభుత్వాస్పత్రులపై ప్రత్యేక పర్యవేక్షణ