
నేడు మండల పరిషత్ ఉప ఎన్నికలు
అత్తిలి: అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వాస్తవంగా మార్చి 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కూటమి నాయకులు అడ్డుకోవడంతో ప్రక్రియ నిలిచింది. మరుసటి రోజున ఎన్నికలకు అధికారులు ఏర్పాటుచేసినా మరలా కూటమి శ్రేణులు భారీగా చేరుకుని ఎంపీటీసీ సభ్యులను మండల పరిషత్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరలా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అత్తిలి చేరుకున్నాయి.
యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక
యలమంచిలి: యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగనున్న మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డ్వామా పీడీ, ప్రిసైడింగ్ అధికారి కేసీహెచ్ అప్పారావు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని, ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటిస్తామని చెప్పారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే సభ్యులు చేతుల ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో మండల పరిషత్ కార్యాలయానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, మండల పరిషత్ సభ్యు లు, ప్రోటోకాల్ ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.
అత్తిలి, యలమంచిలిలో ఎన్నికలు