
కూటమి నాయకుల మధ్య మట్టి రగడ
కొయ్యలగూడెం: సాగునీటి చెరువుల నుంచి నిర్వహిస్తున్న మట్టి తోలకాలు కూటమి నాయకుల మధ్య రగడ సృష్టిస్తున్నాయి. శనివారం సరిపల్లి గ్రామంలో కూటమిలోని రెండు పార్టీల నాయకులు సమీపంలోని చెరువు నుంచి మట్టితోలకాలకు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఘర్షణకు దిగారు. మే 16న రాత్రి దిప్పకాయలపాడు దళితవాడలో రాత్రి వేళల్లో మట్టి రవాణా గురించి స్థానికులు అభ్యంతరం తెలిపి ఆందోళన చేపట్టారు. లారీలను ఆపి అడ్డుకున్నారు. చెరువుల నుంచి చేస్తున్న మట్టితోలకాలు నిబంధన ప్రకారం వ్యవసాయ భూముల అభివృద్ధికి వినియోగించాల్సి ఉన్నప్పటికీ కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోని బేస్‌మెంట్లకు, ఇటుక బట్టీలకు, లేఅవుట్ల స్థలాలకు వినియోగిస్తున్నా కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మట్టి రవాణా వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని కూటమి నాయకులలోని ఒక వర్గం అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ అడగ్గా వాణిజ్య అవసరాలకు మట్టి వెళ్తున్నట్లు ఏవిధమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.