
అడ్మిషన్ల వేట.. ప్రైవేట్ టీచర్ల వ్యథ
ఏలూరులో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయుడు ఉద్యోగంలో చేరి రెండేళ్లు అయ్యింది. స్కూల్‌లో 1 నుంచి 5వ తరగతి వరకు 30 కొత్త అడ్మిషన్లు తేవాలని యాజమాన్యం టార్గెట్ పెట్టింది. నెల రోజుల వ్యవధిలో సదరు టీచర్ 16 అడ్మిషన్లు పూర్తి చేశారు. నూరు శాతం ప్రవేశాలు చేస్తేనే కొలువు ఉంటుందని అల్టిమేటం ఇవ్వగా తప్పనిసరి పరిస్థితుల్లో నగరంలో ఇంటింటా తిరుగుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కార్పొరేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. మండు టెండల్లో అడ్మిషన్ల వేట సాగిస్తూ రోడ్ల బాట పట్టారు. ప్రతి టీచర్‌కు సమ్మర్ స్పెషల్ టార్గెట్‌ను నిర్దేశించడం, లక్ష్యాన్ని పూర్తి చేస్తేనే కొలువు కొనసాగిస్తామని యజమాన్యాలు అల్టిమేటం ఇవ్వడంతో డోర్ టూ డోర్ క్యాంపెయిన్లు చేస్తున్నారు. పిల్లలను స్కూళ్ల చేర్పించేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో సుమారు 10 వేల మంది..
జిల్లాలో 790 ప్రైవేట్ పాఠశాలలు, 82 ప్రైవేట్, కా ర్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 10 వేల మందికి పైగా టీచర్లు, లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరిలో 1 నుంచి 6వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు 3,200 మంది ఉన్నారు. ప్రధాన కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు స్థానిక స్కూళ్లు కూడా నర్సరీ, ప్రైమరీ టీచర్లకు ఎక్కువగా టార్గెట్లు ఇచ్చారు.
తీవ్ర ఒత్తిళ్లు
ప్రైవేట్ స్కూళ్లలో టీచర్‌కు సగటున రూ.8 వేల నుంచి రూ.17 వేల వరకు జీతాలు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టు టీచర్లకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నారు. విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలను చూసుకోవడంతో పాటు వేసవి సెలవుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు అనివార్యంగా కొత్త అడ్మిషన్ల కోసం డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ సంస్కృతి మూడేళ్ల నుంచి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. గతేడాది రెండు కార్పొరేట్ స్కూళ్లలో టార్గెట్ పూర్తి చేయని కారణంతో పదుల సంఖ్యలో టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి.
మౌన ముద్రలో అధికారులు
వేసవి సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరుతో అదనపు దోపిడీ, టీచర్లను అడ్మిషన్ల పేరుతో వేధింపుల పర్వం, డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ విద్యాహ క్కు చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది. అన్నీ తెలిసినా, ఫిర్యాదులు అందినా జిల్లా విద్యాశాఖాధికారులు, ఇంటర్మీడియెడ్ అధికారులు చూసీచూడన ట్టు వ్యవహరిస్తున్నారు. వీరికి వార్షిక మామూళ్లు, మండల స్థాయిలో మూడు నెలలకోసారి మా మూళ్లు ముడుతున్నట్టు సమాచారం.
కార్పొరేట్ ప్రవేశాలు
సమ్మర్ స్పెషల్ టార్గెట్ల పేరుతో వేధింపులు
ప్రతి టీచర్‌కు 30 మంది పిల్లలను చేర్చాలని లక్ష్యం
మండుటెండల్లో డోర్ టూ డోర్ క్యాంపెయిన్
దయనీయంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి
జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల దందా
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు