
ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి
బుట్టాయగూడెం: జీఓ 3కు బదులుగా ప్రత్యేక చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. బుట్టాయగూడెంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగుల నియామక చట్టం కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే బాలరాజు దీక్షకు మద్దతు తెలియజేసి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలపై సుప్రీంకోర్టు జీఓ 3ను కొట్టివేసినా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఏఎన్‌ఎంల నుంచి అన్ని పోస్టులను నూరు శాతం గిరిజనులతోనే భర్తీ చేశామని గుర్తుచేశారు. జీఓ 3కి అనుగుణంగా ప్రత్యేక చట్టం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసి గవర్నర్‌కు కూడా పంపించామన్నారు. అయితే అది చట్టరూపం దాల్చే సమయానికి ఎన్నికలు వచ్చాయన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో జీఓ 3కు బదులు ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారని, గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ హామీ నెరవేర్చలేదన్నా రు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక చట్టం చేయాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం దీక్షా శిబిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు మొడియం శ్రీనివాసరావు, జలగం రాంబాబు, తెల్లం లక్ష్మణరావు, తెల్లం గంగరాజు, కారం రాఘవ, ఎస్.రామ్మోహన్‌రావు, మండలంలోని సర్పంచ్‌లు పాల్గొన్నారు.