
నష్టాల్లో మగ్గుతున్న మామిడి రైతు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నూజివీడు మామిడికి కళ తప్పింది. సాధారణంగా దిగుబడి తగ్గితే పంట ధర పెరుగుతుంది. కానీ మామిడి విషయంలో దిగుబడితో పాటు ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. తెగుళ్లతో నాణ్యత పడిపోవడం దీనికి ఒక కారణంకాగా, ఈ పరిస్థితిని లాభంగా మార్చుకుంటున్న సిండికేట్ వైఖరి మరో కారణం.
‘సాగు’ క్షీణత : ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి సాగు గణనీ యంగా ఉంది. నూజివీడు మామిడికి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగాను మంచి డిమాండ్ ఉంటుంది. మూడేళ్ల క్రితం అమెరికాకు కూడా మామిడి ఎగుమతి చేసిన పరిస్థితి. జిల్లాలో 15 ఏళ్ల క్రితం వరకు 80 నుంచి లక్ష ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి సాగు వరుస నష్టాలు, తుపానుల ధాటికి క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం 52 వేల ఎకరాలకు పడిపోయింది. ఈ సీజన్‌కు సంబంధించి గత డిసెంబర్‌లో మంచి పూత వచ్చినా నల్లతామర తెగులుతో సుమారు 60 నుంచి 70 శాతం మేర దిగుబడి తగ్గిపోయింది. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్ కాయలు), చిన్నరసాలు, పెద్దరసాల సాగు అధికంగా ఉంటుంది.
దేశీయ మార్కెట్‌కే పరిమితం
ఈ ఏడాది జిల్లాలో 1.35 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా, తెగుళ్ల ధాటికి 50 వేల టన్నులకే పరిమితమైంది. ప్రధానంగా బంగినపల్లి, తోతాపురిలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు అవుతుండగా చిన్నరసాలు, పెద్దరసాలు రాష్ట్రంలో విక్రయాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గతేడాది బంగినపల్లి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు, తోతాపురి టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల ధరకు విక్రయించారు. అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన మార్చిలో పంట దిగుబడి లేకపోవడంతో బంగినపల్లి రకం టన్ను ధర రూ.80 నుంచి రూ.లక్ష వరకు పలికి, క్రమక్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.15 వేలకు చేరింది. అలాగే తోతాపురి కూడా ప్రారంభంలో అత్యధికంగా రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పలికిన ధర ప్రస్తుతం రూ.8 వేలకు వేలకే పరిమితమైంది.
మార్కెట్‌లో తగ్గిన హవా
ఏటా మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు నూజివీడు మామిడి విజయవాడ మ్యాంగో మార్కె ట్ ద్వారా ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రధానంగా నూజివీడు వైరెటీకి మహారాష్ట్ర, గుజరాత్‌లో మంచి డిమాండ్ ఉండటంతో అక్కడ వ్యాపారులు ప్రత్యేకంగా స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసే పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటంతో దేశీయ మార్కెట్‌లో నూజివీడు హవా పూర్తిగా తగ్గి తెలంగాణ, ఉలవపాడు మామిడికి కొంత డిమాండ్ పెరిగింది.
50 శాతం పతనమైన ధర
బంగినపల్లి, తోతాపురి ధరల క్షీణత
దిగుబడి తగ్గినా.. ధర పెరగని పరిస్థితి
అకాల వర్షాలు, తెగుళ్లతో నాణ్యతలేమి
తీవ్ర నష్టాల్లో మామిడి రైతులు