
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం : అక్రమంగా కలప రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు కన్నాపురం అటవీశాఖ అధికారి రేంజర్ శివరామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. యర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య బండారు జాతికి చెందిన భారీ వృక్షాలను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందని పేర్కొన్నారు.
చాట్రాయిలో భారీ వర్షం
చాట్రాయి : చాట్రాయిలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొటపాడులో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా చెట్లు కూలిపోయాయి. ఈ వర్షం మెట్ట దుక్కులకు అనువుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. చనుబండ పాత దళితవాడ రోడ్డు జలమయవ్వడంతో కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు
కొయ్యలగూడెం : లారీతో ఢీకొట్టి వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ శుక్రవారం పేర్కొన్నారు. 2018లో చెరుకూరి నరసింహ కొయ్యలగూడెం చేపల మార్కెట్ వద్ద పులిరామన్నగూడెంకు చెందిన నడపాల మంగిరెడ్డిని ఢీకొట్టాడు. దీనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా కొవ్వూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి జీవీఎల్ సరస్వతి శిక్ష విధించారన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతిపై అసంతృప్తి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలికి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి కల్పించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించాయి. 2022లో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు సహకరించారని అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులు దాదాపు పదిమంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. తిరిగి వారికి పోస్టింగ్ ఇచ్చినప్పుడు కేటగిరి ఫోర్‌గా పరిగణించి దూర ప్రాంతాల్లో నియమించారు. సదరు సంఘటనకు సంబంధించి ఇప్పటికీ వారిపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ జరుగుతూనే ఉంది. ఆ విచారణ జరుగుతుండగానే వారిలో ఒక ఉపాధ్యాయురాలికి పెదవేగి మండలం కొప్పాక జెడ్పీ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల తరపున శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి వివరణ కోరగా సదరు ఉపాధ్యాయురాలు రిక్వెస్ట్ పెట్టుకున్నారని పైఅధికారుల సూచనల మేరకే పదోన్నతి కల్పించామని ఆమె తెలిపారు. దొడ్డి దారిన పదోన్నతులు కల్పించటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదోన్నతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అక్రమ కలప స్వాధీనం