
గుక్కెడు నీళ్లు.. గుప్పెడు గింజలు
ఏలూరు(మెట్రో) : వేసవి తాపానికి పక్షులు నీరు దొరక్క అల్లల్లాడిపోతాయి. సమయానికి నీరు, ఆహారం లేకపోవడంతో బిల్డింగుల మధ్య, కరెంటు తీగలపై చాలా వరకూ చనిపోయి కనిపిస్తుంటాయి. అలాంటి చిన్న ప్రాణాలను కాపాడాలని ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ప్రజలకు పలు సూచనలు చేశారు. వేసవిలో నగరాల్లో తిరిగే పక్షులు నీరు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలాంటి పక్షులకు సాయం చేయాలనుకుంటే, పరిశుభ్రమైన నీరు, ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కల్పించాలి. గిన్నెలో మంచినీరు ఉంచి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. ప్రతిరోజూ నీటిని మార్చాలి. పక్షులు తాగేటప్పుడు, సురక్షితంగా కూర్చోవడానికి చిన్న రాళ్ళు లేదా గులకరాళ్లను ఉంచాలి.
ఆకలి తీరుద్దాం
అలాగే వేసవిలో తినేందుకు ఏమీ దొరక్క పక్షులు ఆకలితో అలమటిస్తాయి. అందువల్ల వేసవి వాతావరణానికి అనుకూలంగా ఉండే విత్తనాలు, తృణధాన్యాలు కూడా అందుబాటులో ఉంచాలి. రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వరి ధాన్యం మంచివి.
ఏ పక్షులకు ఎలాంటి ఆహారం ఇవ్వొచ్చు
● పిచ్చుకలు : రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చిరుధాన్యాలు
● చిలుకలు: అరటి, జామ, బొప్పాయి వంటి పండ్లు
● కాకులు, కోకిలలు : వండిన అన్నం, చపాతీలు, మృదువైన పండ్లు