
జలాశయంలోనూ అక్రమ తవ్వకాలు
జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా పార్టీల నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జలాశయంలో అక్రమ తవ్వకాలు చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో అక్రమంగా తవ్వకాలు చేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. చక్రదేవరపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ గ్రావెల్‌ను తవ్వేసి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం నుంచి వయా చక్రదేవరపల్లి మీదుగా వేగవరానికి ఇటీవల రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా బెర్ములను నిర్మించేందుకు ఈ మట్టినే ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎర్రకాలువ జలాశయం ఏఈ ఆర్.శ్రీనివాస్‌ను వివరణ కోరగా జలాశయం సమీపంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.