కొల్లేరులో తుపాకుల మోత | - | Sakshi
Sakshi News home page

గన్‌ కల్చర్‌.. కొల్లేరులో తుపాకుల మోత

May 16 2025 1:30 AM | Updated on May 21 2025 1:44 PM

కొల్ల

కొల్లేరులో తుపాకుల మోత

పక్షులను తోలటానికి నాటు తుపాకుల వాడకం

నల్లమందు వినియోగించి పేలుళ్లు

నెల్లూరు, తమిళనాడు నుంచి వలస కూలీల రాక

తుపాకుల మిస్‌ఫైర్‌తో తరచూ ప్రమాదాలు

కొల్లేరు అక్రమ చెరువులన్నింటి వద్ద ఇదే పరిస్థితి

గత నెలలో మందుగుండు పేలి నలుగురు మృతి

రెండు రోజుల క్రితం ముగ్గురికి గాయాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పక్షులను తోలే సంప్రదాయ వలస కూలీలు నాటు తుపాకులను వినియోగించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దశాబ్దాలుగా కొల్లేరులో నాటు తుపాకుల సంస్కృతి కొనసాగుతుండగా ఏటా పలువురు మృత్యువాతపడటం, గాయాల పాలవడం షరా మాములుగా తయారైంది. పెద్ద పక్షులు చెరువుల్లోని చేపలను ఆహారంగా తీసుకోవడానికి వచ్చినప్పుడు నల్లమందు వినియోగించి తుపాకీ పేలుళ్ల శబ్ధం చేస్తే కొన్ని గంటల పాటు చెరువు దరిదాపుల్లోకి రావు. దీంతో ఎక్కువ చెరువుల వద్ద గన్‌కల్చర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా గత నెలలో మందుగుండు పేలి పది మంది గాయాలపాలై నలుగురు మరణించడం, అలాగే రెండు రోజుల క్రితం మిస్‌ఫైర్‌తో ముగ్గురు గాయాలైన ఘటన కొల్లేరులో చోటు చేసుకుంది.

చెరువుల కాపలా పనులు చేస్తూ..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో 901 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 12 మండలాల్లో 3.50 లక్షల మంది ప్రజలు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విదేశాల నుంచి శీతాకాలంలో లక్షల సంఖ్యలో పక్షులు వలస వచ్చి కొల్లేరులో గుడ్లు పొదిగి తిరిగి వెళ్తుంటాయి. ఏటా కొల్లేరుకు విదేశాల నుంచి లక్షన్నరకు పైగా వివిధ జాతుల పక్షులు వీటిలో అత్యధికంగా పెలికాన్‌ పక్షులు వస్తుంటాయి. కొల్లేరులో ఆక్రమణల పర్వం దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ సాగు అనేది ఇక్కడ నిత్యకృత్యం. ఈ క్రమంలో కొల్లేరులో చేపల చెరువుల కాపలా పనులకు నెల్లూరు, తమిళనాడుకు చెందిన వలస కూలీల కుటుంబాలు నిర్వహిస్తుంటాయి. ప్రధానంగా పులికాట్‌ సరస్సు ప్రాంతం వద్ద ఉండే వీరు సీజన్‌లో ఇక్కడకు వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు.

ప్రమాదం అంచున పని

స్థానికంగా కొల్లేరు ప్రాంతంలో నాటు తుపాకులు అద్దెకు ఇస్తుంటారు. కేవలం చెరువుల వద్దకు కాపలాకు మాత్రమే వీటిని వినియోగిస్తుంటారు. కొందరు వలస కూలీలు రోజూ కూలి కోసం ప్రమాద అంచున నిత్యం పనిచేస్తున్నారు. తుపాకుల పేలుళ్లు ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ఇదే పని చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక కులానికి చెందిన వారే నాటు తుపాకులతో పక్షులను వేటాడుతుంటారు. గత నెలలో కై కలూరు నియోజకవర్గం భైరవపట్నంలో ఇవే కుటుంబాలకు చెందిన ఒక ఇంట్లో మందుగుండు పేలి పది ఇళ్లు తగలబడి నలుగురు మృత్యువాతపడగా ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే రెండు రోజుల క్రితం కై కలూరు మండలం రామవరంలో మందుగుండు పేలి చరణ్‌, మణి సతీష్‌, కందాపుల మణికి తీవ్ర గాయాలయ్యాయి.

నల్లమందుతో నాటు తుపాకులు

భాస్వరం, పొటాషియం వంటి పేలుడు పదార్థాలను నూరి నల్లమందును తయారు చేస్తారు. చిన్నపాటి రాపిడి జరిగితేనే పేలే స్వభావం ఉంటుంది. వీటిని నాటు తుపాకుల్లో నింపి గాల్లో పక్షులు వచ్చినప్పుడు కాల్పులు చేస్తుంటారు. ప్రధానంగా తమిళనాడు, రాష్ట్రంలోని సూళ్ల్లూరుపేటకు చెందిన 150 కుటుంబాలు కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసం ఉన్నాయి. ఆక్వా చెరువుల యజమానులు రోజు కూలికి వీరిని తీసుకు వెళ్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు చెరువు వద్ద నాటు తుపాకీతో కాపలా ఉంటే పెద్ద పక్షిని తోలితే రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తుంటారు. అలా కొందరు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు సంపాదించే పరిస్థితి. వీరు చెరువుల వద్దే తాత్కాలిక పాకలు వేసుకుని నివాసం ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement