
ఘనంగా కాటన్ జయంతి
ఏలూరు(మెట్రో): ఏలూరు ఇరిగేషన్ డేటాకాంప్లెక్స్‌లో సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతిని ఇరిగేషన్ శాఖ ఎన్‌జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చోడ గిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏలూరు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిలకపాటి దేవప్రకాష్, ఇంజనీర్స్ ఫెడరేషన్ కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎన్జీఓ సంఘ కార్యదర్శి ఎన్. రామారావు, నోరి శ్రీనివాస్, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శర్వాణీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏపీజేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్‌ఎస్ హరనాథ్ ఆధ్వర్యంలో కాటన్ జయంతి నిర్వహించారు. శ్రీపూడి శ్రీనివాసరావు, తెర్లి జయరాజు, భోగేశ్వరరావు పాల్గొన్నారు.
6,067 మంది విద్యార్థుల హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 6,067 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ మ్యాథ్స్ బీ/ జువాలజీ/ హిస్టరీ పరీక్షలకు 5,059 మందికి 4,830 మంది, ఒకేషనల్ పరీక్షలకు 390 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 650 మందికి 601 మంది, ఒకేషనల్ పరీక్షలకు 269 మందికి 246 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
ఏపీఆర్‌జేసీలో 2వ ర్యాంకు
ద్వారకాతిరుమల: ఏపీఆర్‌జేసీ–2025 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ద్వారకాతిరుమలకు చెందిన పొడుదోలు సాయి పర్ణిక రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. అలాగే పాలిసెట్‌లో 37వ ర్యాంక్ సాధించినట్టు తల్లిదండ్రులు రాంబాబు, శ్యామలాదేవి తెలిపారు. సాయి పర్ణిక కామవరపుకోట మండలం తాడిచర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతుండగా, టెన్త్ పరీక్షల్లో 593 మార్కులు సాధించింది. చదువులో రాణిస్తున్న సాయి పర్ణికను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
సమీకృత సాగుతో లాభాలు
ఉంగుటూరు: స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయం కోసం సమీకృత సాగు మేలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం మండలంలోని నాచుకుంట, వెల్లమిల్లిలో సమీకృత వ్యవసాయ విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతులు గద్దె రత్నాజీ, పరిమి సత్యనారాయణతో మాట్లాడి సమీకృత సాగు, ప్రకృతి వ్యవసాయ విధానాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా సమీకృత వ్యవసాయ విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా అంతటా అమలు చేయాలని యోచిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి ఎన్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ పి.రవికుమార్ కలెక్టర్ వెంట ఉన్నారు.
ఈ సెట్‌లో 601 మంది అర్హత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తూ ఈనెల 6న నిర్వహించిన ఏపీ ఈ సెట్ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో పరీక్షలకు 657 మంది హాజరు కాగా 601 మంది అర్హత సాధించారు. వీరిలో 432 మంది బాలురు, 169 మంది బాలికలు ఉన్నారు. 91.48 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పెదపాడు మండలం వసంతవాడకు చెందిన పరసా ఆదిత్యబాబు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 131 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు.
ఆకివీడు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్
ఆకివీడు: జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహిం చిన ఏపీఈసెట్– 20 25 పరీక్షలో బీఎస్సీ స్ట్రీమ్‌లో ఆకివీడు మండలం తరటావకు చెందిన కొట్టి గంగా భవానీ రాష్ట్రస్థాయిలో 95 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే దళిత కుటుంబానికి చెందిన కాశీ విశ్వనాథం కుమార్తె గంగాభవానీ డిగ్రీ ఏలూరు సీహెచ్‌ఎస్‌డీ థెరిస్సా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివింది.

ఘనంగా కాటన్ జయంతి