
తనిఖీలు నామమాత్రం.. తవ్వకాలు నిత్యకృత్యం
ద్వారకాతిరుమల: పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలకు ఎట్టకేలకు మైనింగ్ విజిలెన్స్ అధికారుల్లో చలనం కలిగింది. అయితే గురువారం అధికారులు చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిచ్చాయి. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం, ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుతూ కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై వరుస కథనాలు ప్రచురించగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం కాలువ గట్టుపైకి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఒక్కచోట మాత్రమే కారు దిగి పరిశీలించారు. అది కూడా అనుమతులు ఇచ్చిన ప్రాంతంలోనే పరిశీలించి.. మిగిలిన రెండు పాయింట్లను పట్టించుకోలేదు. అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే అక్రమార్కులు పొక్లెయిన్లు తీసుకువచ్చి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలించారు. గ్రావెల్‌ను కై కలూరు–పామర్రు హైవే రహదారి నిర్మాణం, నారాయణపురంలో చేపల చెరువుల గట్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారుల తనిఖీల సంగతి కూటమి నేతలకు ముందే తెలిసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాలువ గట్టును తవ్విన ప్రాంతాల్లో భారీ గోతులు కనిపిస్తున్నా అధికారులు ఏమీ లేనట్టు వెళ్లిపోవడం రైతులను విస్మయానికి గురిచేసింది. ఇక పచ్చ నేతలు ఇచ్చే రిపోర్టే.. అధికారుల తుది నివేదిక అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
చక్రం తిప్పుతున్న ముగ్గురు పచ్చ నేతలు
ప్రధానంగా గ్రావెల్ దందాలో ముగ్గురు పచ్చ నేతలు చక్రం తిప్పుతున్నారు. అన్ని వ్యవహారాలను వారు మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఓ జనసేన నేత గ్రావెల్ తవ్వుతున్నందుకు ఒక్కో టిప్పర్‌కు రూ.500 వసూలు చేస్తున్నారట. ఇలా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనిపై పీఐపీఆర్‌ఎంసీ ఏఈ బాపూజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
పోలవరం కుడి కాలువ గట్టుకు తూట్లు
నామమాత్రంగా అధికారుల పరిశీలన
పచ్చల నేతల రిపోర్టే తుది నివేదిక!