సీట్లు పాయె.. నిధులు రావాయె | - | Sakshi
Sakshi News home page

సీట్లు పాయె.. నిధులు రావాయె

May 15 2025 1:16 AM | Updated on May 15 2025 1:59 AM

సీట్లు పాయె.. నిధులు రావాయె

సీట్లు పాయె.. నిధులు రావాయె

తాడేపల్లిగూడెం: ఇన్‌చార్జిల పాలన, బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ ఇష్టారాజ్యం కారణంగా ప్రతిష్టాత్మకమైన తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో విద్యార్థుల భవితవ్యం మసకబారుతోంది. ప్రారంభంలో నిట్‌లో ఉన్న సీట్లు సంఖ్య భారీగా తగ్గించేయడంతో ఇక్కడి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్‌ నిట్‌ మెంటార్‌గా ఉన్న సమయంలో నిధులు వచ్చాయి. ఇన్‌చార్జి డైరెక్టర్లు ఆరంభ సమయంలో తాత్కాలిక భవనంలో పనిచేసినప్పుడు నిధులు వచ్చాయి. తొలి రెగ్యులర్‌ డైరెక్టర్‌ వచ్చాక రూ.400 కోట్లకు పైగా వెచ్చించి పక్కా భవనాలు నిర్మించారు. సీట్ల సంఖ్య కూడా 480 నుంచి 750కు పెరిగింది. అనంతరం నిట్‌పై అవినీతి మరకలు పడ్డాయి. తొలి డైరెక్టర్‌ సస్పెండయ్యారు. ఇక ఇన్‌చార్జిల పాలన, బోర్డు ఆఫ్‌ గవర్నెన్సు ఇష్టారాజ్యంగా సాగింది. సీట్లు పోయినా అడిగే వారు లేరు. కేంద్ర ఉన్నత విద్యాశాఖను ప్రశ్నించేవారు కరువయ్యారు. కొంత కాలం ఇన్‌చార్జి డైరెక్టర్‌ పాలనలో ఇక్కడ తిష్టవేసిన ఆ నలుగురిదే రాజ్యం అన్నట్టుగా సాగింది. గతంలో ఇక్కడ మెంటార్‌గా వ్యవహరించిన డాక్టర్‌ ఎన్‌వీ రమణరావు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా వచ్చారు. దీంతో నిట్‌ కాస్త గాడిలో పడ్డట్టు కనిపించినా, వెనక్కి పోయినా సీట్లు ఇంకా రాలేదు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా ప్రస్తుతం ఏపీ నిట్‌ పరిస్థితి ఉన్న సీట్లు పాయె. నిధులు రావాయె అన్నట్టుగా తయారయ్యింది.

సీట్ల కుదింపు

శాశ్వత ఫ్యాకల్టీ, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది లేని సమయంలో ఏపీ నిట్‌లో సీట్ల సంఖ్య 750 ఉంది. సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయింపు జరిగినా, అవి ఏపీ నిట్‌కు వచ్చేవి. ఏపీ నిట్‌లో తొలి డైరెక్టర్‌ సస్పెండ్‌ కావడాన్ని కేంద్ర ఉన్నత విద్యాశాఖలో బూచిగా చూపించడంలో అక్కడ అప్పట్లో ఏలిన ఆ నలుగురు కృతకృత్యులయ్యారు. బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌కు ఇది వరంగా మారింది. సీట్లను తగ్గిస్తామన్నా.. ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఆ సమయంలో ఉన్న వారు అభ్యంతరం చెప్పలేదు. దీంతో బోర్డు ఆఫ్‌ గవర్నెన్సు ఏపీ నిట్‌లోని సంఖ్యను 750 నుంచి 480 కు తగ్గించారు. ఏడాదిన్నర దాటుతున్నా, ఇంకా సీట్లు 480 వద్దే ఉండిపోయాయి.

ఫ్యాకల్టీలు వచ్చినా పెరగని సీట్లు

శాశ్వత ఫ్యాకల్టీల నియామకం కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. 25 మందికి గాను 16 మంది ఫ్యాకల్టీలు వచ్చారు. అదే సమయంలో బోధనా సిబ్బంది 125 మందిని రిక్రూట్‌మెంటు చేసుకోవడం కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. పూర్తిస్థాయి డైరెక్టర్‌ లేరన్న ఒకే ఒక్క కారణంతో భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ కూడా ఇదే దారిలో నడిచింది. అంతిమంగా ఈ విద్యాసంవత్సరంలో అదనంగా రావాల్సిన, కోల్పోయిన 270 సీట్లు రాకుండా పోయాయి.

పనులకు మోక్షం ఎప్పుడో..

నిట్‌ శాశ్వత భవనాల నిర్మాణంలో భాగంగా తొలిదశ పనులను ఏ, బీ కింద విభజించి రూ.400 కోట్ల పైబడి నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. కెనరా బ్యాంకు ద్వారా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్సు(హెఫా) ద్వారా రూ.428 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో రూ.70 లక్షలతో పరిశోధనా పరికరాలకోసం ప్రతిపాదించారు. బాలురు వసతి గృహం, బాలికల హాస్టల్‌, ట్ల్రెనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌, రీసెర్చ్‌ పార్కు, డిపార్టుమెంటు బిల్డింగ్‌, ఇంటర్నేషనల్‌ విద్యార్థుల వసతి గృహం, ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ క్వార్టర్స్‌ నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించారు. ఆ పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాల్సిందే.

ఇన్‌చార్జిల పాలనతో అస్తవ్యస్తంగా నిట్‌

తగ్గిన సీట్లు.. ఆగిన నియామకాలు

వెనక్కి వెళుతున్న ప్రగతి

సీట్లు, నిధులు వస్తాయి

ఏపీ నిట్‌లో ప్రస్తుతానికి సీట్ల సంఖ్య 480కి తగ్గినా త్వరలోనే మిగిలిన 270 సీట్లు తిరిగివస్తాయి. నిర్మాణాల కోసం పంపించిన ప్రతిపాదనల సొమ్ములు ఆరు నెలల్లో వస్తాయని భావిస్తున్నాం.

–దినేష్‌ రెడ్డి, ఏపీ నిట్‌ రిజిస్ట్రార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement