
వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి
పోలవరం రూరల్: పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక ఒక నిండు గర్భిణీ మృత్యువాత పడింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలవరం మండలం కొత్తకుంకాల గ్రామానికి చెందిన తామ శిరీష (25) గర్భిణి. మంగళవారం రాత్రి నొప్పులు రావడంతో ఆటోలో ఆమెను భర్త పోలవరం వైద్యశాలకు తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యాధికారి లేకపోవడంతో సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాజమంత్రి ఆసుపత్రికి తరలించాలని అంబులెన్స్ ఎక్కించగా, పరిస్థితి విషమించి ఆమె అంబులెన్స్‌లో మృతిచెందింది. షుగర్ లెవల్స్ పెరగడంతో మృతిచెందిందని వైద్యాధికారులు పేర్కొన్నారు. వైద్యాధికారి నిర్లక్ష్యానికి ఒక గిరిజన గర్భిణీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యాధికారులు వైద్యం అందించక పోవడంతేనే ఈ ఘటన జరిగిందనే విషయం ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతురాలు శిరీషకు రెండేళ్ల పాప ఉంది. ఐటీడీఏ పీవో నాయక్ కూడా వైద్యశాలను పరిశీలించి ఘటనపై విచారణ నిర్వహించారు.
మృతురాలి బంధువుల ఆరోపణ

వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి