మట్టి తీసి గట్టు మీద పెట్టు | - | Sakshi
Sakshi News home page

మట్టి తీసి గట్టు మీద పెట్టు

May 13 2025 12:42 AM | Updated on May 13 2025 12:42 AM

మట్టి

మట్టి తీసి గట్టు మీద పెట్టు

ఉండి: ఉండి సబ్‌ డివిజన్‌ పరిధిలో కొత్తగా ఏడు కాలువల పూడికతీత పనులు, గత ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు చేపట్టేందుకు ఇటీవల హడావిడిగా అధికారులు సమాయత్తమయ్యారు. పనులు చేసే విధానం చూస్తుంటే రైతులకు మేలు జరగటం పొరపాటే అని అర్ధం అవుతుంది. కాలువల్లో పూడిక తీసి ఆ మట్టిని వేరే ప్రాంతానికి తరలిస్తే కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా ఉంటుంది. కానీ కాలువల్లో తీసే పూడిక మట్టిని పొక్లెయినర్‌ సహాయంతో గట్లపైనే వేసి కాంట్రాక్టర్‌లు చేతులు దులుపుకుంటున్నారు. కాలువల్లో నీరు ఉన్నాగాని పొక్లెయినర్‌ల సహాయంతో వారికి నచ్చిన ప్రాంతంలో మట్టిని తీసి గట్లపై వేసి పూడిక తీసేసినట్లు మసిపూసి మారేడు కాయచేస్తున్నారు. అంతే కాకుండా చాలా పని చేసేసినట్లు గట్లపైనా, కాలువ అంచున ఉండే గడ్డిని పొక్లెయినర్‌ సహాయంతో తొలగించి ఆ ప్రాంతంలో పూడికను చాలా బాగా తొలగించినట్లు చెప్పడం విశేషం. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లో కాలువగట్ల వెంబడి ఉండే సీసీరోడ్లపైనా పూడిక తీసిన మట్టిన వేసి సీసీరోడ్లను మట్టిరోడ్లుగా మార్చేస్తున్న విధానంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పేవారు లేరంటే పనులు జరుగుతున్న తీరు అర్థం చేసుకోవచ్చు. కాలువల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు అధికారులు కూడా కంటికి కనిపించడం లేదంటే.. పనులు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో తెలుస్తోంది.

ఉండి సబ్‌ డివిజన్‌లో మొత్తం 9 పనులు మంజూరు

ఉండి ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌లో మొత్తం 9 పూడికతీత పనులు ఈ వేసవిలో ప్రారంభిస్తున్నారు. వీటిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.94 లక్షలతో ఏడు పనులు, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు రూ.12.16 లక్షల అంచనాలతో పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో మొదటిగా ఉండి మండలం కలిసిపూడి రెగ్యులేటర్‌ నుంచి శివారు ప్రాంతం అజ్జమూరు సరిహద్దు వరకు రూ.33 లక్షల అంచనాలు కాగా అగ్రిమెంట్‌ రూ.22 లక్షలు (వీటిలో లష్కర్‌ జీతాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు)గా పనిని ప్రారంభించారు. వాండ్రం కాలువ రూ.7.06 లక్షల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి యండగండి సెక్షన్‌లో లోసరి మెయిన్‌ కాలువ, బాపనకోడు, యండగండి అప్పర్‌పేర్లల్‌ కాలువ, చిలకంపాడు సెక్షన్‌లో రావిపాడు కాలువ, వీఎండబ్ల్యూ కాలువ పరిమెళ్ళ లాకుల వద్ద లీడింగ్‌ కాలువ పూడిక తీత పనులు రూ.62 లక్షలతో చేపట్టాల్సిన ఐదు పనులు రెండు లేదా మూడు రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో రూ.12.16 లక్షల అంచనాలతో మంజూరైన అర్తమూరు, పాములపర్రు కాలువ, జక్కరం బొర్రకోడుల పనులు చేపట్టాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రారంభించిన రెండు పనుల్లో ఇంతటి దారుణం జరుతుంటే చేపట్టాల్సిన మొత్తం ఏడు పనుల్లోను ఎంతటి దారుణాలు చోటుచేసుకుంటాయో అని రైతులు వాపోతున్నారు.

తూతూమంత్రంగా కాలువల ఆధునికీకరణ?

కాలువలో మట్టి తీసి వేరే ప్రాంతానికి తరలించకుండా గట్టుపైనే వేస్తున్న వైనం

పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి

కలిసిపూడి, వాండ్రం కెనాల్‌ పూడిక తీత పనులు పారదర్శకంగా జరుతున్నాయి. అనుకున్న విధంగానే పనులు చేపట్టి పూర్తి చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నీరు ఉండడం వల్ల రెండు లేదా మూడు రోజుల్లో మిగిలిన పనులు ప్రారంభిస్తాము.

– డీఈ పీఎన్‌వీవీఎస్‌ మూర్తి, ఉండి

మట్టి తీసి గట్టు మీద పెట్టు 1
1/1

మట్టి తీసి గట్టు మీద పెట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement