
లక్ష్మీనారాయణుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చతుర్భుజ లక్ష్మీతాయార్లు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి (చినగోపురం) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తి వాస్తవ్యులు, కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధానార్చకులు ముప్పిరాల అనంతాచార్యస్వామి, వారి శిష్య బృందంచే విశ్వక్సేనారాథన, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, బుత్విగరుణము, మృత్సంగ్రహణము, అంకురార్పణ, కుంబావాహన, నివేదన, మంగళాశాసనము, తీర్థప్రసాద వినియోగముతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బిరుదుకోట శంకర్ తెలిపారు.
దేశంలోనే రెండో క్షేత్రం
స్వామివారు అష్టబాహువులతో దేశంలో మొత్తం రెండు ప్రాంతాల్లో మాత్రమే కొలువై ఉన్నారని.. ఒకటి కంచి, రెండవది పాలకొల్లులో మాత్రమేనని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో మూలవిరాట్ స్వామివారికి కుడివైపున లక్ష్మీతాయారు, ఎడమ భాగంలో ఆండాళ్లవారి ఉపాలయాలు, వెనుక భాగంలో ఆళ్వార్లు ఉపాలయాలు ఉన్నాయి. ఆలయంలో స్వామివారికి ఎడమ వైపు భాగంలో శ్రీరామక్రతువు స్తూపం, ఆగ్నేయంలో స్వామివారి హోమ మండపం, ఉత్తర భాగంలో స్వామివారి కళ్యాణోత్సవ మండపాలు ఉన్నాయి. అలాగే స్వామివారికి స్థానిక బంగారువారి చెరువుగట్టున తోటోత్సవం నిర్వహించే మండపం ఉంది. ఇక్కడ సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న గాలిగోపురం నేడు చినగోపురంగా ప్రసిద్ధి చెందినది. శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి (పెద్దజీయరుస్వామి) విశ్వకళ్యాణముకై ప్రతిష్టించిన 108 శ్రీరామ క్రతువు స్తంభాల్లో 85వ స్థంభం 1968లో ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు.
ఉత్సవాలు ఇలా..
13వ తేదీన ఉదయం అలంకార తిరుమంజనం, రాత్రి ఊంజల్ సేవ, చంద్రవాహనసేవ, తిరువీధి ఉత్సవం
14న రాత్రి శేషవాహనసేవ
15న హనుమంత వాహనసేవ
16న గరుడ వాహనసేవ, అనంతరం పటికబెల్లంతో శ్రీ కృష్ణ తులాభారాం
17న ఉదయం శ్రీవారికి పూలంగి సేవ, రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవము, అనంతరం శ్రీవారి తిరు కల్యాణం
18న ఉదయం శ్రీవారికి చందనోత్సవం, రాత్రి రథోత్సవం
19న ఉదయం వసంతోత్సవం అనంతరం ధ్రువమూర్తుల తిరుమంజనం, మధ్యాహ్నం మహా పూర్ణాహుతి, రాత్రి ప్రణయ కలహం (ఏడు ముసుగుల ఉత్సవము), దివ్య మంగళ దర్శనం
20న ఉదయం సుదర్శన మహాయజ్ఞం, మధ్యాహ్నం తిరుప్పావడై ఉత్సవం, రాత్రి పండిత సత్కారం అనంతరం శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు.

లక్ష్మీనారాయణుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం